- డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి
కొండపాక, వెలుగు: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి పిలుపునిచ్చారు. కొండపాక మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు బైరి ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్పంచ్ల సన్మాన సభలో పాల్గొని మాట్లాడారు.
నియోజకవర్గంలో 100 మందికి పైగా కాంగ్రెస్బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందారని ఇది కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితం అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇదే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి జడ్పీ చైర్మన్ సీటును కైవసం చేసుకునేలా పనిచేయాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ పరశురాములు, సర్పంచులు మానస, గంగాధర్, వెంకటేశ్, మండల అధ్యక్షుడు లింగారావు, నాయకులు సురేందర్ రావు, సుదర్శన్, మహదేవ్, కనకరాములు, రాజు పాల్గొన్నారు.
