హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ ఈ నెల 18న చేవెళ్లలో పాదయాత్ర చేపట్టనుందని, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యాత్ర జరగనుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ తెలిపారు. గురువారం గాంధీ భవన్‌లో సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో నిత్యావసరాల ధరల పెంపును నిరసిస్తూ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో పాదయాత్ర చేస్తున్నారని, దానికి సంఘీభావంగా తాము కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. డిజిటల్ మెంబర్షిప్పై పార్టీ పరిశీలకుడు బోసురాజుతో చర్చించామని, జనవరి 26 నాటికి 30 లక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. పార్లమెంట్ ఇన్‌చార్జిలతోనూ భేటీ అయ్యామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్పంచులు, జడ్పీటీసీలకు నిధులు రాక దిక్కు తోచని స్థితిలో ఉన్నారని మల్లు రవి అన్నారు. కాగా, ఉదయం గాంధీ భవన్‌లో బంగ్లాదేశ్ లిబరేషన్ డే విజయ్ దివస్ డే సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటానికి పలువురు నివాళులర్పించారు.

