Glenn Maxwell: టీ20 క్రికెట్ లో ఒక విధ్వంసకర వీరుడికి చెక్ పడినట్టుగానే కనిపిస్తుంది. దశాబ్దకాలానికి పైగా టీ20 క్రికెట్ లో ఆధిపత్యం చూపించి ఆ గ్రేటెస్ట్ ప్లేయర్ ఇకపై అంతర్జాతీయ క్రికెట్ లో కనిపించకపోవచ్చు. రివర్స్ స్వీప్, స్కూప్ షాట్స్, స్విచ్-హిట్ ఇలా షాట్ ఏదైనా అలవోకగా బాదేసే ఆ పవర్ హిట్టర్ కథ దాదాపుగా ముగిసింది. ఎంతో మంది బౌలర్ల పాలిట నరకంలా మారి ఇన్నోవేటివ్ షాట్స్ కు కేరాఫ్ గా నిలిచిన ఆ ఆస్ట్రేలియా టీ20 ఎక్స్ ప్లోజివ్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్. ఇప్పటికే వన్డే, టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మ్యాక్స్వెల్ తాజాగా టీ20 క్రికెట్ కు కూడా గుడ్ బై చెప్పనున్నాడు.
టీ20 క్రికెట్ కు అంటే పూనకం వచ్చేలా ఆడే ఆటగాళ్లలో మ్యాక్స్వెల్ ఒకడు. అయితే ఇప్పుడు ఈ ఆసీస్ వీరుడికి కష్టకాలం కొనసాగుతుంది. బౌలర్లను వీర ఉతుకుడు ఉతికే మ్యాక్సీ బ్యాట్ నుంచి గత రెండేళ్లుగా పరుగులు రావడం లేదు. అంతర్జాతీయ క్రికెట్ లో ఘోరంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ లో అయితే గత నాలుగు సీజన్ లుగా ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇదంతా కాదని పాకిస్థాన్ సూపర్ లీగ్ వెళ్లి ఆడినా అక్కడ కూడా సింగిల్ డిజిట్ కే పరిమితమవుతున్నాడు. ఒకప్పుడు బౌలర్లను వణికించిన మ్యాక్సీ ఇప్పుడు పార్ట్ టైం బౌలర్లకు కూడా తలవంచుతున్నాడు. 150 కిలో మీటర్ల బంతికి కూడా అలవోకగా రివర్స్ స్కూప్ ఆడగలిగే ఈ ఆసీస్ విధ్వంసం ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. దీంతో మ్యాక్స్ వెల్ కు ఇప్పుడు రిటైర్మెంట్ కావడం తప్పితే మరో ఆప్షన్ లేదు అనేలా ఉంది.
ఫామ్ లో లేకపోయినా మ్యాక్స్వెల్ మ్యాటిక్ విన్నర్ అని ఇటీవలే టీ20 వరల్డ్ కప్ లో అవకాశం ఇచ్చారు. కానీ మ్యాక్సీ మాత్రం తీవ్రంగా నిరాపరిచాడు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో 62 పరుగులు చేసి పూర్తిగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఇకపై ఈ పవర్ హిట్టర్ ఆస్ట్రేలియా జట్టులో కనిపించే సూచనలు దాదాపుగా లేనట్టే. ఆస్ట్రేలియా రానున్న ఏడాదిలో కేవలం ఇంగ్లాండ్ పై మాత్రమే 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. దీంతో యంగ్ క్రికెటర్లకు అవకాశాలివ్వడం కోసం 37 ఏళ్ళ మ్యాక్స్ వెల్ ను పక్కన పెట్టనున్నట్టు సమాచారం.
IPL 2025 లో ఫైనల్‌కు చేరుకున్న పంజాబ్ కింగ్స్, మినీ వేలానికి ముందే తమ స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ ను విడుదల చేసింది. మెగా వేలంలో పంజాబ్ మాక్స్వెల్ ను రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, అతను జట్టు విజయాన్ని అందించలేకపోయాడు. గత సీజన్‌లో పంజాబ్ తరపున మాక్స్‌వెల్ మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 8 సగటుతో కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. తన బౌలింగ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టగలిగాడు. మాక్స్‌వెల్ ప్రదర్శనతో ఇకపై ఈ ఆసీస్ వీరుడిపై ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించకపోవచ్చు. గత సీజన్ లోనే కాదు అంతకముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కూడా మ్యాక్స్ వెల్ తన పూర్ ఫామ్ తో జట్టులో స్థానం కోల్పోయాడు.
ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్న మ్యాక్స్ వెల్ ఇక్కడ కూడా పేలవ ఫామ్ తో జట్టుకు భారమయ్యాడు. హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టు తరపున ఆడిన 5 మ్యాచ్ ల్లో నాలుగు సార్లు సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు. సొంత దేశంలో జరిగిన బిగ్ బాష్ టీ20 లీగ్ లోనూ పెద్దగా ఆడింది ఏమీ లేదు. ఇలా ఎక్కడ చూసినా మ్యాక్స్ వెల్ కు కష్టకాలం తప్పట్లేదు. ఇకపై మ్యాక్స్వెల్ పై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో పాటు ఏ టీ20 ఫ్రాంచైజీ కూడా కరుణించడం కష్టంగానే కనిపిస్తుంది.ఇప్పటికే 37 ఏళ్ళ మ్యాక్స్ వెల్ కు వయసు కూడా అడ్డంకిగా మారుతుంది. అంతేకాదు ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ లోనూ మ్యాక్స్ వెల్ స్థానం దక్కించుకోలేకపోయాడు. ఒకవేళ మ్యాక్స్ వెల్ బాగా ఆడినా కాంపిటీషన్ ధాటికి ఈ వెటరన్ ప్లేయర్ ను ఎంపిక చేయకపోవచ్చు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే మ్యాక్స్ వెల్ త్వరలో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం తప్ప మరో ఆప్షన్ లేనట్టు అర్ధమవుతోంది.

