గుజరాత్ ఎన్నికలు: ఆదివాసీలే టార్గెట్ గా మోడీ, రాహుల్ క్యాంపెయిన్

గుజరాత్ ఎన్నికలు: ఆదివాసీలే టార్గెట్ గా మోడీ, రాహుల్  క్యాంపెయిన్

గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్​, ఆప్ పార్టీలో జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై మండిపడ్డారు. గుజరాత్ లో రెండ్రోజులుగా క్యాంపెయిన్ లో పాల్గొంటున్న ప్రధాని మోడీ.. గిరిజన, ఆదివాసీలే టార్గెట్ గా ప్రచారం నిర్వహించారు. గిరిజనులకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని మోడీ విమర్శించగా.. ఆదివాసీల భూములు బీజేపీ లాక్కుంటోందని రాహుల్ కౌంటర్ ఇచ్చారు.

గుజరాత్ అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. గుజరాత్ మోడల్ తో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాముడు, కృష్ణుడు కాలం నుంచి దేశంలో గిరిజనులు ఉన్నా.. కాంగ్రెస్ వారి సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదన్నారు. గిరిజనులు అధికంగా ఉండే బరూచ్ జిల్లాలోని జంబూసర్ లో ప్రధాని మోడీ ప్రచారంలో పాల్గొన్నారు. తాను గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరిస్తే.. కాంగ్రెస్ నాయకులు ఎగతాలి చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఆదివాసీలు ఉన్నారనే విషయం కాంగ్రెస్ నేతలకు తెలియదని, వాజ్ పేయ్ వచ్చేదాకా వారికి ప్రత్యేక మంత్రిత్వశాఖ కూడా లేదని మండిపడ్డారు మోడీ.

ఆ తర్వాత సురేంద్రనగర్ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కాంగ్రెస్ వాళ్లు తనకు ధైర్యం లేదని అంటున్నారని.. అభివృద్ధిపై ఫేస్ టు ఫేస్ చర్చించేందుకు తాను సిద్ధమని.. కాంగ్రెస్ నేతలు డిబేట్ కు వస్తారా అని సవాల్ చేశారు. తాను రాజ కుటుంబం నుంచి రాలేదని.. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చానన్నారు. భారత్ జోడో యాత్రలో రైతుల గురించి మాట్లాడుతున్నారని.. కానీ రాహుల్ వెంట యాత్ర చేసే వారిలో ఎవ్వరూ రైతులు లేరన్నారు. 24గంటల కరెంట్ ఇస్తామంటే.. కాంగ్రెస్ వాళ్లు సాధ్యం కాదన్నారని.. కానీ 10ఏళ్లుగా గుజరాత్ లోని ప్రతీ గ్రామానికి 24గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు.

ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత.. గుజరాత్ లో మొదటిసారి ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. సూరత్, రాజ్ కోట్ లో క్యాంపెయిన్ చేశారు. బీజేపీ ఆదివాసీలను వనవాసీలుగా చూస్తోందని విమర్శించారు రాహుల్. ఆదివాసీలే ఇండియాకు మొదటి ఓనర్లని చెప్పారు. జల్, జంగిల్, జమీన్ తోనే ఆదివాసీల జీవన విధానం ముడిపడి ఉందని తెలిపారు. ఆదివాసీల భూములను లాక్కుని ఇద్దరు, ముగ్గురు వ్యాపారవేత్తలకు కట్టబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. పట్టణాల్లో ఆదివాసీలు నివసించడం, వారికి విద్య, వైద్యం అందడం బీజేపీకి ఇష్టం లేదన్నారు రాహుల్. 

ఆ తర్వాత రాజ్ కోట్ ప్రచారంలో పాల్గొన్న రాహుల్.. మోర్బీలో తీగల వంతెన కూలి.. 150మంది చనిపోతే.. సంబంధిత వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. కాంట్రాక్ట్ సంస్థపై కనీసం FIR కూడా నమోదు చేయలేదని.. ఏదో ఇద్దరు వాచ్ మెన్ల సస్పెన్షన్ తో సరిపెట్టారని చెప్పారు. తమకు కావాల్సిన వారు కాబట్టే.. బీజేపీ బాధ్యులపై చర్యలు తీసుకోలేదన్నారు రాహుల్.

కేంద్రహోంమంత్రి అమిత్ షా గుజరాత్ జునాగడ్ లోని మంగ్రోల్ లో ప్రచారం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోర్బండలో ప్రచారం నిర్వహించారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ ను రద్దు చేయాలని గాంధీ పిలుపునిచ్చారని.. బాపు కలను సాకారం చేసే సమయం వచ్చిందన్నారు యోగి.