V6 News

మా ప్రభుత్వ పనితీరుకు పంచాయతీ ఫలితాలే నిదర్శనం : మహేశ్ గౌడ్

 మా ప్రభుత్వ పనితీరుకు పంచాయతీ ఫలితాలే నిదర్శనం : మహేశ్ గౌడ్
  • ఫస్ట్ ఫేజ్​లో 62% కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచిన్రు: మహేశ్ గౌడ్
  • ఫుట్​బాల్ మ్యాచ్ కోసం మెస్సీని ప్రైవేట్ సంస్థ తీసుకొస్తున్నది
  • బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నరు
  • కవిత చేస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ విచారణ జరిపించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ప్రజా ప్రభుత్వ పనితీరుకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. ‘‘రెండేండ్లుగా ప్రజా పాలనలో రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారు. ఈ విజయంతో పల్లెల అభివృద్ధికి సంబంధించి మాపై బాధ్యత మరింత పెరిగింది. కాంగ్రెస్ సంస్థాగతంగా ఇంకా బలోపేతమైంది. పల్లె ప్రజలతో పార్టీ లీడర్లకు అనుబంధం ఏర్పడింది’’అని అన్నారు.

 శుక్రవారం గాంధీ భవన్​లో మంత్రి అజారుద్దీన్​తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 62 శాతం గెలిచారని తెలిపారు. మరో 13 శాతానికి పైగానే తమకు అనుకూలంగా ఉండే ఇండిపెండెంట్లు.. కాంగ్రెస్ మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎం సపోర్టర్స్ తో విజయం సాధించారని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కూడా 25 శాతం పంచాయతీలను గెలుచుకోలేకపోయాయని ఎద్దేవా చేశారు.

ఓ క్రీడాకారుడిగా సీఎం అటెండ్ అవుతున్నరు

ఫుట్ బాల్ మ్యాచ్ కోసం ఓ ప్రైవేట్ సంస్థ మెస్సీని తీసుకొస్తున్నదని, దీనిపై కూడా బీజేపీ రాద్ధాంతం చేస్తున్నదని మహేశ్ గౌడ్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓ క్రీడాకారుడిగా అందులో పాల్గొంటున్నారని, దీంతో ప్రభుత్వపరంగా సెక్యూరిటీ ఏర్పాట్లు తప్ప, ఇందులో ఖర్చు ఏమీ లేదన్నారు. ‘‘ఆదివారం ఢిల్లీలోని రాంలీల మైదానంలో జరగనున్న ఓట్ చోరీ మహాధర్నాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొంటారు. 

ధర్నా అనంతరం రాష్ట్రపతికి వినతిపత్రం అందజేస్తాం. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తయిన గ్రామాల్లోని లీడర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలిరావాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ కవిత చేస్తున్న భూ ఆక్రమణలపై సీఎం రేవంత్ రెడ్డి దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతున్న. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అడ్డగోలుగా భూ ఆక్రమణలు, అవినీతికి పాల్పడ్డారు. వాటిని కవిత బయటపెడుతున్నారు’’అని మహేశ్ గౌడ్ అన్నారు. కవితకు సీఎం కావాలనే ఆశ ఉండడంలో తప్పులేదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా సీఎం కావొచ్చని తెలిపారు. అయితే, రాజకీయాల్లో అత్యాశ కూడా పనికిరాదన్నారు.

బీజేపీ ఓట్ చోరీనిజమని తేలింది

మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం 4,230 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. 2,600కుపైగా స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్​లుగా గెలిచారని, ఇక ఏకగ్రీవం అయిన పంచాయతీల్లో 90 శాతం పార్టీ మద్దతుదారులేనని మహేశ్ గౌడ్ వెల్లడించారు. ‘‘బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసినా.. వెయ్యిలోపు పంచాయతీలను బీఆర్ఎస్, 200 వరకు పంచాయతీలను బీజేపీ, 40 సీపీఎం, 30 సీపీఐ గెలుచుకున్నాయి. మా ప్రజాపాలన మెచ్చి, జనం కాంగ్రెస్ మద్దతుదారులకు పట్టం కట్టారు. రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లను బీజేపీ ఓట్ చోరీతోనే గెలిచింది. దీనికి కేంద్ర మంత్రి బండి సంజయ్ జవాబివ్వాలని డిమాండ్ చేసినా.. ఆయన స్పందించలేదు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న సర్పంచ్ సంఖ్యను చూస్తే నేను చేసిన ఆరోపణలు నిజమని అనిపిస్తున్నది. 

రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, మరో 8 మంది ఎమ్మెల్యేలను బీజేపీ గెలుచుకున్నది. వీళ్లంతా ఓట్ చోరీతో గెలవకుంటే పంచాయతీ ఎన్నికల్లో ఆ ఓట్లు ఎటు పోయినయ్? ఏమైనయ్?’’అని మహేశ్ గౌడ్ నిలదీశారు. రెండో, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలంతా కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. ప్రజా పాలనను ఆదరించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమన్వయంతో పనిచేసిన మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను మహేశ్ గౌడ్ అభినందించారు.

సాయి ఈశ్వర్ చారి కుటుంబానికి పరామర్శ  

జీడిమెట్ల, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్ చారి కుటుంబాన్ని శుక్రవారం జగద్గిరిగుట్టలో మంత్రులు పొన్నం ప్రభాకర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్​తో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ చారి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబానికి రూ.5లక్షల చెక్కు అందజేశారు. అనంతరం మహేశ్ గౌడ్ మాట్లాడారు. ‘‘బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం. ఈశ్వర్ చారి మరణం బాధాకరం’’అని మహేశ్​ గౌడ్ అన్నారు.