- జనగామ, తొర్రూర్ లో అధికార పార్టీకి కలిసి వచ్చిన అదృష్టం
- ఈ రెండు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్కు సమాన ఓట్లు
- డ్రా ద్వారా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఫలితాలు తేల్చిన అధికారులు
- రెండు రోజుల ఉత్కంఠకు తెర
- ఎన్నిక జరిగిన తీరుకు నిరసనగా బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆందోళన
మహబూబాబాద్/జనగామ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో అధికార పార్టీని అదృష్టం వరించింది. ఈ రెండు చోట్లా బీఆర్ఎస్, కాంగ్రెస్కు సమాన ఓట్లు రాగా, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కోసం అధికారులు మంగళవారం డ్రా తీశారు. కాగా, అటు జనగామలోనూ, ఇటు తొర్రూరులోనూ చైర్పర్సన్ స్థానాలు కాంగ్రెస్‌కే దక్కడం విశేషం. జనగామ వైస్‌చైర్‌పర్సన్ బీఆర్ఎస్కు దక్కగా, తొర్రూర్ వైస్‌చైర్‌పర్సన్ పదవి కాంగ్రెస్‌నే వరించింది. కాగా, రెండు చోట్ల ఎన్నికలు జరిగిన తీరుకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు.
తొర్రూర్లో టెన్షన్..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ స్థానాలకు మంగళవారం భారీ పోలీస్ బందోబస్త్ నడుమ లక్కీ డ్రా ద్వారా నిర్వహించారు. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 9 వార్డులను గెలుచుకున్నాయి. ఎక్స్ అఫీషియో సభ్యులుగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరు కావడంతో, రెండు పార్టీలకు 9 ఓట్లు వచ్చాయి. దీంతో ఆఫీసర్లు లక్కీ డ్రా నిర్వహించారు. లక్కీ డ్రాలో కాంగ్రెస్కు చెందిన తూనం శ్రావణ్చైర్పర్సన్గా, అదే పార్టీకి చెందిన సోమ రజిత వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. దీంతో పట్టణంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు.
బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన
తొర్రూరులో 9 వార్డుల్లో గెలుపొందగా కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చేసి వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటుతో అడ్డదారిలో చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. నేలపై బైఠాయించగా, పోలీసులు నచ్చజెప్పి పంపించారు. ఇదిలాఉంటే ఎన్నిక సందర్భంగా పట్టణంలో మంగళవారం ఉదయం నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య బాహాబాహీ జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మహబూబాబాద్ ఎస్పీ శబరీశ్, భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ ఆధ్వర్యంలో వెయ్యి మంది పోలీసులు పట్టణంలో కవాతు నిర్వహించారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించి, ప్రజలు గుమిగూడవద్దని హెచ్చరించారు. పట్టణానికి వచ్చే రహదారులపై చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఆఫీస్‌కు వెళ్లే రహదారులను పూర్తిగా నిర్బంధించారు. వ్యాపార సంస్థలను మూసి వేయించారు. ఎన్నిక పూర్తయ్యేంత వరకు ఆంక్షలు కొనసాగడంతో సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారు.
వరించిన అదృష్టం..
జనగామలో ఉద్రిక్త వాతావరణం మధ్య జరిగిన ఎన్నికలో మున్సిపల్ చైర్పర్సన్ పోస్టును కాంగ్రెస్ దక్కించుకుంది. బీఆర్ఎస్కు వైస్ చైర్పర్సన్ దక్కింది. పూర్తి మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఇండిపెండెంట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నలుగురు ఇండిపెండెంట్లలో ఇద్దరేసి చొప్పున రెండు పార్టీల్లో చేరడం, ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా ఒక్కోటి ఉండడంతో కాంగ్రెస్కు 16, బీఆర్ఎస్కు 16 మంది చొప్పున బలం సమకూరింది. ఈక్రమంలో సోమవారం కౌన్సిలర్ కిడ్నాప్ వ్యవహారంపై గందరగోళం చెలరేగి ఎన్నిక వాయిదా పడింది.
భారీ బందోబస్తు నడుమ..
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జనగామలో బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రతి వెహికల్‌ను తనిఖీ చేశారు. జనగామ చౌరస్తా నుంచి మున్సిపాలిటీ వరకు పోలీసులు మోహరించారు. బందోబస్తు నడుమ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు మున్సిపాలిటీకి చేరకున్నారు. కాంగ్రెస్ నుంచి కడకంచి బాలమణి, బీఆర్ఎస్ నుంచి సుగుణాకర్ పేర్లు ప్రకటించి చేతులెత్తే పద్దతిలో ఎన్నిక నిర్వహించారు.
పోడియం వద్ద బీఆర్ఎస్ ఆందోళన..
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్ మంజుల చేయి పట్టుకున్న కాంగ్రెస్ కౌన్సిలర్ కరుణాకర్ రెడ్డి, ఇండిపెండెంట్ కౌన్సిలర్ మారబోయిన పాండును వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. వారిద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోడియం చుట్టుముట్టి బైఠాయించారు. వారిని అరెస్ట్ చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
మీటింగ్‌లో గందరగోళం
బీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లేసే క్రమంలో ఇండిపెండెంట్ కౌన్సిలర్ మంజుల చెయ్యి లేపుతుండగా, మరో ఇండిపెండెంట్ కౌన్సిలర్ మారబోయిన పాండు ఆపాడు. అదే సమయంలో కాంగ్రెస్ కౌన్సిలర్ కరుణాకర్‌రెడ్డి కూడా మంజుల ఓటు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో మీటింగ్‌లో గందరగోళం చెలరేగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రెండు పార్టీలకు 16 ఓట్ల చొప్పున రావడంతో చివరికి లాటరీ నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి కడకంచి బాలమణి చైర్‌పర్సన్‌గా ఎన్నికవగా, వైస్ చైర్‌పర్సన్‌గా భూష పర్వతాలు ఎంపికయ్యారు. వారితో ఆర్డీవో గోపీరాం ప్రమాణ స్వీకారం చేయించారు.
కన్నీటిపర్యంతమైన ఎర్రబెల్లి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో వరంగల్ ఎంపీ కడియం కావ్యకు ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా అవకాశం కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని నరసింహులపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పష్టమైన మెజార్టీ వచ్చినా పదవిని అక్రమంగా దక్కించుకున్నారని చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు.
తొర్రూరు ప్రజలు పూర్తి మెజార్టీ బీఆర్ఎస్ కు కట్టబెట్టినప్పటికీ, కాంగ్రెస్ నాయకులు ఎక్స్ అఫీషియో సభ్యుల పేరుతో అధికారాన్ని సొంతం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వరంగల్ నగరంలో ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా పేరు నమెదు చేసుకున్న ఎంపీకి, తొర్రూరులో ఓటు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. లక్కీ డ్రాలోనూ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని వాపోయారు. ఎన్నికపై కోర్టుకు వెళ్తామని చెప్పారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ మంత్రి రెడ్యానాయక్ ఆయనకు సంఘీభావం తెలిపారు.
