
ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని సమీక్షించేందుకు ఇవాళ కాంగ్రెస్ కు చెందిన జీ- 23 నాయకులు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. నాయకత్వ మార్పిడి విషయంపై ప్రధానంగా చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకోవడం.. సమర్ధులైన బయటి నాయకులకు బాధ్యతలు అప్పగించడం వంటి అంశాలపై ఈ సమావేశం ఎజెండాగా తీసుకున్నారు. సీనియర్ నాయకులైన.. భూపీందర్ సింగ్ హుడా, రాజీందర్ కౌర్ భట్టల్, వీరప్ప మొయిలీ, పృథ్వీరాజ్ చౌహాన్, గులాంనబీ ఆజాద్, కపిల్ సిబల్, మనీస్ తివారీ, వివేక్ టంఖా, ఆనంద్ శర్మ లాంటి వాళ్లు ఇవాళ్టి సమావేశానికి రానున్నారు. కాంగ్రెస్ కు మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చే అంశాలపై చర్చిచనున్నారు. అయితే ఈ భేటీ సందర్భంగా అందరి దృష్టి ఆజాద్ మీదే నిలిచింది. ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఆజాద్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందనేది ఆసక్తి రేపుతోంది.