అసెంబ్లీలో కాంగ్రెస్ వ్యూహం.. ఒక్కొక్కరూ ఒక్కొక్క అంశంపై..

అసెంబ్లీలో కాంగ్రెస్ వ్యూహం.. ఒక్కొక్కరూ ఒక్కొక్క అంశంపై..

సీఎల్పీ మీటింగ్​లో ఎమ్మెల్యేల నిర్ణయం

రేవంత్​రెడ్డి అరెస్టును ఖండిస్తూ తీర్మానం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో లోపాలపై అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించాలని కాంగ్రెస్ లెజిస్లేచర్​ పార్టీ(సీఎల్పీ) నిర్ణయించింది. రైతు సమస్యలు, తాగునీటి సమస్యలపై నిలదీయాలని కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు అనుకున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎల్పీ శుక్రవారం సమావేశమైంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్​లో పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పాల్గొన్నారు. పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ రేవంత్​రెడ్డి అరెస్టును ఖండిస్తూ సీఎల్పీ తీర్మానం చేసింది. రేవంత్​అరెస్టుపై ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో శనివారం సమావేశం కావాలని నిర్ణయించారు. కాగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి పార్టీ కండువా లేకుండానే అసెంబ్లీకి వచ్చారు.

వాస్తవాలకు దూరంగా గవర్నర్​ ప్రసంగం

అసెంబ్లీలో గవర్నర్​ ప్రసంగం వాస్తవాలకు దూరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గవర్నర్ ప్రసంగంలో పస లేకపోవడంతోపాటు పుస్తకాన్ని కూడా క్వాలిటీ లేకుండా ప్రింట్ చేశారని చెప్పారు. బీఏసీ మీటింగ్ తర్వాత అసెంబ్లీ హాల్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ గురించి గవర్నర్ ప్రసంగంలో లేదన్నారు. నిరుద్యోగ భృతి, సాగునీటి ప్రాజెక్టులపై క్లారిటీ లేదని, డబుల్ ఇండ్లపై ఆరేండ్ల నుంచి ఒకే మాట చెప్తున్నారని ఆరోపించారు.

నాకు పీసీసీ ఇవ్వకుంటే..: రాజగోపాల్​రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేందుకు తాను రెడీగా ఉన్నానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అన్నారు. హైకమాండ్​ తనకు అవకాశం ఇవ్వకపోతే బీజేపీనా లేదా ఇతర పార్టీనా అనేది భవిష్యత్ నిర్ణయిస్తుందని చెప్పారు. ఏ పార్టీ అనేది ముఖ్యం కాదని, కేసీఆర్ ను ఓడగొట్టామా లేదా అనేది ముఖ్యమన్నారు. రెండు దఫాలుగా సరైన నాయకుడిని ఎన్నుకోవడంలో హైకమాండ్​ తప్పులు చేసిందని, ఈసారైనా సరైన నాయకుడిని ఎన్నుకుంటుందని భావిస్తున్నానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ప్రజల నుంచే నాయకుడు పుడతాడన్నారు. నిజామాబాద్ లో కూతురు కవిత ఓటమితోనే సీఎం కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని, ప్రజలు ఎవరికి ఓటు వేసినా గెలిచిన వాళ్లను డబ్బులతో సీఎం కొనేస్తూ డబ్బు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, ఆ పార్టీలోని చాలా మంది నేతలు బయటికి రాబోతున్నారని చెప్పారు.

ఏ సబ్జెక్టుపై ఎవరు మాట్లాడతారంటే..

అసెంబ్లీలో ఏ సబ్జెక్టుపై ఎవరు మాట్లాడాలనేది సీఎల్పీ మీటింగ్​లో నిర్ణయించారు.

భట్టి విక్రమార్క: ఇరిగేషన్, ఎంప్లాయిమెంట్, రియింబర్స్ మెంట్, ఎడ్యుకేషన్

డి.శ్రీధర్ బాబు: రైతు సమస్యలు, ఇరిగేషన్

కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి: తాగునీటి సమస్య, ఎక్సైజ్, హైదరాబాద్ లోని పబ్బులు

సీతక్క: సంక్షేమం, మహిళల అంశాలు, పోడెం

వీరయ్య: గిరిజన అంశాలు

జగ్గారెడ్డి: ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లుపై అసెంబ్లీలో మాట్లాడనున్నారు.