ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శివిర్

ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శివిర్
  • రాజస్థాన్ ఉదయ్ పూర్ లో  కాంగ్రెస్ నవ సంకల్ప్  చింతన్ శివిర్
  • నేటి నుండి మూడు రోజుల పాటు జరగనున్న చింతన్ శివిర్ సమావేశాలు
  • చింతన్ శివిర్ కు హాజరుకానున్న 430 మంది కాంగ్రెస్ నేతలు
  • భవిష్యత్ వ్యూహాలు, ప్రజా సమస్యలు, కార్యాచరణ పై చర్చ

ఇవాళ్టి నుంచి ఈనెల 15 వరకు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ చింతన్ శివిర్ భేటీలు కొనసాగనున్నాయి. పార్టీలోని పరిస్థితులు, ఎన్నికల్లో వరుస ఓటములు, అంతర్గత సవాళ్లు వంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ చింతన్ శివిర్ కు సిద్ధమైంది. ఆ పార్టీలోని సమస్యలు, ప్రస్తుత పరిస్థితులపై విస్తృతంగా చర్చించే వేదికే చింతన్ శివిర్. చివరిసారిగా 2013లో చింతన్ శివిర్ ను నిర్వహించారు.

రాజస్థాన్ ఉదయ్ పూర్ లో జరిగే ఈ చర్చల్లో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ సహా పార్టీక చెందిన 430 మంది ప్రధాన నేతలు పాల్గొననున్నారు.  పార్టీ పునరుద్ధరణ, 2024 లోక్ సభ ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేయడం..భవిష్యత్ పొత్తులపై వ్యూహరచన ముఖ్య ఎజెండాగా చర్చించనున్నారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, జమ్ముకశ్మీర్, పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం, పెట్టుబడుల ఉపసంహరణ, ఈశాన్య రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వైఖరి, సామాజిక అసమానతలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వివిధ పార్టీలతో పొత్తుల వంటి కీలక అంశాలపై పార్టీ అగ్రనేతలు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పునరుద్ధరించాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని జీ 23 నేతలు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సభ్యత్వాల నమోదు ప్రక్రియ విస్తృతంగా చేపడుతున్నారు. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణ ఉంటుందని..ఇదివరకే పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. దీనిపై కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే.. చింతన్ శివిర్ లో ఏఐసీసీ నాయకత్వంపై చర్చించే అవకాశం లేదని తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ తిరిగి స్వీకరించాలని పలువురు నేతలు కోరుతున్నా..నాయకత్వ సమస్యపై చర్చకు రాకపోవచ్చని సమాచారం.

బీజేపీని వ్యతిరేకిస్తూ ఏర్పాటయ్యే కూటమిలో కాంగ్రెస్ దే ప్రధాన పాత్ర అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యూపీఏ ప్లస్ ప్లస్ పేరుతో కొత్త కూటమిని తెరపైకి తెస్తున్నాయి. అందరూ కలిసి పనిచేస్తే 2024 ఎన్నికల్లో ఎన్డీఏను ఓడించవచ్చనేది కాంగ్రెస్ ఉద్దేశం. అయితే కాంగ్రెస్ కేంద్రంగా ఇప్పటికే యూపీఏ కూటమి ఉంది కానీ మరింత భారీ కూటమి అవసరమని.. యూపీఏ ప్లస్ ప్లస్ అయితే బాగుంటుందన్నారు సచిన్ పైలట్. 

కాగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రసంగంతో సదస్సు ప్రారంభం కానుంది. సదస్సులో వివిధ అంశాలపై 430 మంది ప్రతినిధులు ఆరు బృందాలుగా మారి చర్చించనున్నారు. రెండ్రోజుల పాటు ఈ చర్చలు కొనసాగాక.. మూడో రోజున డిక్లరేషన్ ను ప్రవేశపెట్టనున్నారు. మూడో రోజు జరిగే సీడబ్ల్యూసీ భేటీలో డిక్లరేషన్ పై చర్చలు జరపనున్నారు. విస్తృత చర్చల తర్వాత నవ సంకల్ప తీర్మానంతో చింతన్ శివిర్ ముగియనుంది.