సుప్రీంకోర్టు తీర్పు..  కేంద్రానికి చెంపదెబ్బ : కాంగ్రెస్ 

సుప్రీంకోర్టు తీర్పు..  కేంద్రానికి చెంపదెబ్బ : కాంగ్రెస్ 

న్యూఢిల్లీ :  ఎన్నికల సంఘానికి ఎలక్టోరల్  బాండ్ల వివరాలు వెల్లడించాల్సిందేనని ఎస్​బీఐని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయి. సుప్రీంకోర్టు ఆదేశం కేంద్ర ప్రభుత్వానికి చెంపదెబ్బ అని కాంగ్రెస్  పార్టీ పేర్కొంది. తాము అధికారంలోకి వస్తే స్విస్  బ్యాంకుల్లో దాచి ఉంచిన నల్లధనాన్ని వంద రోజుల్లో వెనక్కి తెస్తామని 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక నల్ల కుబేరుల వివరాలు దాచడానికి చేయగలిగింది అంతా చేసిందని కాంగ్రెస్  చీఫ్​ మల్లికార్జున ఖర్గే విమర్శించారు.

మోదీ సర్కారు మోసపూరిత విధానాల నుంచి దేశాన్ని సుప్రీంకోర్టు మరోసారి కాపాడిందని ట్విటర్ లో ఆయన పేర్కొన్నారు. ‘ఎలక్టోరల్  బాండ్ల వివరాలు వెల్లడించడానికి నాలుగున్నర నెలల సమయం కావాలని ఎస్​బీఐ కోరింది. అంటే ఈ టైంలో నల్ల కుబేరుల వివరాలను దాచడానికి మోదీ సర్కారుకు చాలినంత సమయం దొరుకుతుందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఎలక్టోరల్  బాండ్ల ద్వారా బీజేపీకి ఎవరెవరు డబ్బులు ఇచ్చారో సుప్రీంకోర్టు తీర్పుతో త్వరలోనే దేశమంతా తెలుస్తుంది. మోదీ ప్రభుత్వ అవినీతి, స్కాములను బట్టబయలు చేయడంలో మొదటి అడుగు పడింది అని ఖర్గే ట్వీట్  చేశారు.

మోదీ డొనేషన్ల బిజినెస్  బట్టబయలైందని కాంగ్రెస్  మాజీ చీఫ్​ రాహుల్  గాంధీ ట్వీట్  చేశారు. బీజేపీకి డొనేషన్లు ఇచ్చిన వారిని వదిలేసి సామాన్యులపై మోదీ సర్కారు పన్నుల భారం మోపిందని ఆయన ఫైర్  అయ్యారు. ఒకరోజుతో అయిపోయే పనికి నాలుగున్నర నెలల సమయం అడగడం హాస్యాస్పదమని, ఎస్​బీఐకి చెంపదెబ్బ అని కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, చిదంబరం అన్నారు. అవినీతిని చట్టబద్ధం చేయకుండా అడ్డుకోవడంలో మొదటి అడుగు పడిందని సీపీఎం నేత సీతారాం ఏచూరి మీడియాతో అన్నారు.