ధరణి లొసుగులతో భూముల ఆక్రమణకు కుట్ర

ధరణి లొసుగులతో భూముల ఆక్రమణకు కుట్ర
  •     పోర్టల్ తో ఎక్కువగా ప్రయోజనం పొందింది బీఆర్ఎస్ నేతలే 
  •     ధరణి ప్రత్యేక కమిటీ అధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపణ

శామీర్ పేట, వెలుగు :  ధరణి పోర్టల్ లోని లొసుగులను కొందరు బీఆర్ ఎస్ నేతలు ఆసరాగా చేసుకుని పేదల భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ధరణి ప్రత్యేక కమిటీ అధ్యక్షుడు కోదండ రెడ్డి తెలిపారు. గురువారం మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం బొమ్మరాసిపేట్ లో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను సమస్యలను అడిగి తెలుసుకోగా.. తమ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని, పేర్లు తప్పుగా ఉన్నాయని, వివిధ కారణాలతో పాస్ పుస్తకాలు ఇవ్వడానికి అధికారులు సాకులు చెబుతున్నారని వివరించారు. 

అదే సర్వే నంబర్ లోని భూముల్లోని బడా రాజకీయ నేతలు, భూస్వాములు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని అమ్ముకుంటున్నారని, తాత ముత్తాతల నుంచి కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న తమ భూములను ధరణిలోని రశువుల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల నుంచి పూర్తి వివరాలను కోదండ రెడ్డి బృందం సేకరించి, న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు. 

భూమి ఉన్నా తమ పేరిట లేకపోవడంతో హక్కులు పొందలేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. ధరణి కమిటీ సభ్యుడు, లీగల్ అడ్వైజర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 45 వేల దరఖాస్తులు ధరణి పోర్టల్ లో పెండింగ్ లో ఉన్నాయన్నారు. ధరణి కమిటీ  రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తుందన్నారు.