బీసీలను అధికారానికి దూరం చేసే కుట్ర : దాసు సురేశ్

బీసీలను అధికారానికి దూరం చేసే కుట్ర : దాసు సురేశ్
  • జలదృశ్యంలో  కొండా లక్ష్మణ్​ బాపూజీకి పలువురి నివాళి

ముషీరాబాద్, వెలుగు: సామాజిక తెలంగాణను సాధించి, అధికారంలో అట్టడుగు వర్గాలను భాగస్వామ్యం చేయడమే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి రాష్ట్ర ప్రజలు అందించే నిజమైన నివాళి అని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ పేర్కొన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు.. బీసీ ముఖ్యమంత్రి అనే ఎజెండాతో రాజకీయంగా ముందుకెళ్తామన్నారు. గురువారం ట్యాంక్ బండ్ జలదృశ్యం వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ 11వ వర్ధంతిని బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  బీసీ వర్గాలకు అధికారాన్ని దూరం చేసే అగ్రవర్ణాల కుట్ర దేశం, రాష్ట్రంలో  కొనసాగుతుందని ఆరోపించారు. రాష్ట్ర బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు బాపూజీకి జలదృశ్యంలో నివాళులర్పించకపోవడం అగ్రవర్ణ పాలనలో వారి బానిసత్వానికి నిదర్శనమన్నారు. 

ప్రత్యేక తెలంగాణ ద్వారా అన్నివర్గాలకు అవకాశాలను అందించాలని బాపూజీ భావిస్తే, నేటి పరిపాలన అందుకు విరుద్ధంగాసాగుతుందని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అన్నారు. గల్ఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రుద్ర శంకర్, విమలక్క, బీఎస్ పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, కమిషన్ సభ్యులు ఉపేందర్, కిశోర్, అడ్వకేట్ జేఏసీ నేతలు నాగుల శ్రీనివాస్ యాదవ్, ప్రొఫెసర్ తాటికొండ వెంకట్రాజం, జగదీశ్ యాదవ్, ప్రొఫెసర్ గాలి వినోద్, బహుజన మూర్తి పార్టీ నేతలు లక్ష్మణ్, దాసు రామ్ నాయక్,  లంబాడీ ఐక్య వేదిక అధ్యక్షుడు  రాజ్​కుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు.