గంజాయి ముఠా దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య మృతి

గంజాయి ముఠా దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య మృతి
  • నిజామాబాద్లో డ్యూటీలో ఉండగా కారుతో ఢీ కొట్టిన గంజాయి స్మగ్లర్లు
  • వారం రోజులు మృత్యువుతో పోరాటం 
  • మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌‌‌‌తో పరిస్థితి విషమం.. కాపాడేందుకు  విశ్వప్రయత్నం

గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌‌ కానిస్టేబుల్‌‌ సౌమ్య (25) మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా పరిస్థితి విషమించడంతో చనిపోయారు.

హైదరాబాద్, వెలుగు: గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌‌ కానిస్టేబుల్‌‌ సౌమ్య (25) మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా పరిస్థితి విషమించగా.. ఆమెను బతికించేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె  నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.  

శనివారం రాత్రి 9:41 గంటలకు సౌమ్య మృతి చెందినట్లు నిమ్స్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. చిన్న వయసులోనే సౌమ్య మరణించడం పట్ల నిమ్స్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాము శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఆమెను దక్కించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ, మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. డ్యూటీలో ఉన్నప్పుడే ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవడంతో ఎక్సైజ్ శాఖలోనూ విషాదం అలుముకున్నది. 

అసలేం జరిగిందంటే..

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మోస్రా గ్రామానికి చెందిన సౌమ్య (25).. నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌‌లో కానిస్టేబుల్‌‌గా పని చేస్తున్నారు. జనవరి 23న (శుక్రవారం) సాయంత్రం 6:30 గంటల సమయంలో నిజామాబాద్‌‌లోని మాధవనగర్ రోడ్డులో డ్యూటీలో ఉండగా.. గంజాయి స్మగ్లర్లు ఆమెను కారుతో ఢీకొట్టారు.  ఈ దాడిలో ఆమె పొట్ట భాగంలో బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆమెను నిజామాబాద్‌‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసి.. దెబ్బతిన్న ప్లీహం, ఎడమ కిడ్నీని తొలగించారు. లివర్ కూడా డ్యామేజ్ కావడంతో పరిస్థితి సీరియస్ అయ్యింది. 

మెరుగైన వైద్యం కోసం జనవరి 25న హైదరాబాద్‌‌లోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే ఆమె పల్స్ రేట్ 140 ఉండగా.. బీపీ 60/40కి పడిపోయింది. దాదాపు 7 రోజుల పాటు నిమ్స్ లోని రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఆర్‌‌‌‌ఐసీయూ)లో ఆమెకు చికిత్స అందించారు.  ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో సౌమ్య శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతిన్నాయి.  చివరికి వెంటిలేటర్ పై ఉంచి అత్యాధునిక చికిత్స అందించినప్పటికీ.. శరీరం సహకరించకపోవడంతో ఆమె తుదిశ్వాస విడిచారు.