హైవే ఆలస్యం..రెండేండ్లుగా ముందుకుసాగని నేషనల్ హైవే 353బి పనులు

హైవే ఆలస్యం..రెండేండ్లుగా ముందుకుసాగని నేషనల్ హైవే 353బి పనులు
  • జిల్లాలో 33 కిలోమీటర్లమేర రోడ్డుతోపాటు హైలెవల్ బ్రిడ్జి
  • ఆలస్యంతో తరోడ వంతెన వద్ద ప్రయాణికుల ఇక్కట్లు
  • పంట పొలాల నుంచి రోడ్డు విస్తరణపై రైతుల అభ్యంతరం

ఆదిలాబాద్, వెలుగు: జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లా బోరజ్ వరకు నిర్మించనున్న హైవే 353 బి పనులు ముందుకుసాగడంలేదు. రెండేండ్ల క్రితం ఆర్అండ్ బీ ఆధీనంలో ఉన్న ఈ రోడ్డును నేషనల్ హైవేగా అప్ గ్రేడ్ చేశారు. పనులు ప్రారంభించేందుకు 4 నెలల క్రితం టెండర్లు పిలిచినప్పటికీ ఇంకా వాటిని ఫైనల్ చేయడం లేదు.

సదరు కాంట్రాక్టర్లకు సంబంధించి సాంకేతిక అంశాలు పూర్తి కాకపోవడంతో మరింత ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. బోరజ్ నుంచి మహారాష్ట్ర వరకు నిర్మించే రోడ్డుకు జైనథ్ మండలంలోని తరోడ గ్రామం వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. గతేడాది ఈ బ్రిడ్జికి పగుళ్లు వచ్చి దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయంగా బ్రిడ్జి కింద వాగులోంచి తాత్కాలికంగా రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే ఆ రోడ్డు పలుమార్లు వర్షానికి కొట్టుకుపోయి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

వర్షం పడినప్పుడల్లా వాగు పారడంతో బ్రిడ్జి కింది నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. దీంతో జైనథ్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు లాండసాంగ్వి గ్రామం మీదుగా 15 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి ఆదిలాబాద్‌‌‌‌ వెళ్లా=ల్సి వస్తోంది. రెండేండ్లుగా బ్రిడ్జి నిర్మాణం జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు బేల జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చేపట్టే భూ సేకరణ పనులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. పంట పొలాల నుంచి రోడ్డు విస్తరణకు తమ వ్యవసాయ భూములు ఇవ్వబోమంటూ స్పష్టం చేస్తున్నారు. దీంతో భూ సేకరణపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు.

రూ.490.92 కోట్ల నిధులు మంజూరు

మహారాష్ట్ర నుంచి బేల, జైనథ్ మీదుగా భోరజ్ నేషనల్ హైవే 44 వరకు 353బి రోడ్డు విస్తరణ పనులు చేపట్టనుండగా ఆదిలాబాద్ జిల్లాలో 33 కి.మీ. మేర పనులు చేయనున్నారు. హైవే నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న రహదారిని 7 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు పెంచుతారు. రూ. 490.92 కోట్లతో పనులు చేపట్టనున్నారు.

ఇందులో రూ.360 కోట్ల రోడ్డు విస్తరణకు కాగా మిగతా నిధులు భూ సేకరణకు కేటాయించారు. జైనథ్ మండలం తరోడ గ్రామం వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం, అవసరమైన చోట సర్వీస్ రోడ్లు, భూసేకరణ కోసం ఈ నిధులు వెచ్చించనున్నారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసి రిపోర్టును కేంద్రానికి అందజేయగా ప్రక్రియ టెండర్ల దశలోనే నిలిచిపోయిది. ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు 32 హెక్టార్ల భూములు అవసరం కాగా.. ఇటు టెండర్లు పూర్తి కాక, భూ సేకరణ జరుగక విస్తరణ పనులు ముందుకు సాగడంలేదు.

వాణిజ్య పరంగా అభివృద్ధి

మహారాష్ట్ర నుంచి బేల, జైనథ్ బోరజ్ నేషనల్ హైవే 44 వరకు నిత్యం వేల సంఖ్యలో వాహనాలు నడుస్తాయి. ప్రయాణికులకు సంబంధించిన వెహికల్స్​తోపాటు పాటు వ్యాపారాలకు సంబంధించిన లారీలు, ట్రావెల్స్  నిత్యం రాకపోకలు సాగిస్తాయి.

ముఖ్యంగా మహారాష్ట్రలోని రాజురా, గడ్ చందూర్, చంద్రాపూర్​లో ఉన్న సిమెంట్ ప్యాక్టరీలకు సిమెంట్ లారీలు, బొగ్గుతోపాటు ఇతర సరుకులు తెలంగాణకు రవాణా అవుతాయి. ఆదిలాబాద్ -బేల సెక్షన్​లోని డబుల్ లేన్ విస్తరణ వల్ల మహారాష్ట్ర, తెలంగాణకు రవాణా సదుపాయాలతో పాటు ఆర్థిక కార్యకలాపాలు మెరుగవుతాయి. ఈ రోడ్డు కనెక్టివిటీతో జైనథ్ లక్ష్మీనారాయణ ఆలయంతోపాటు జిల్లా టూరిజం అభివృద్ధి చెందే అవకాశం ఉంది.  

టెండర్ దశలో ఉన్నాయి

మహారాష్ట్ర నుంచి బోరజ్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి  టెండర్ దశలో ఉంది. రూ.360 కోట్లతో విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుంది. టెండర్ల త్వరలో పూర్తి చేసి భూ సేకరణ ప్రక్రియ ప్రారంభిస్తాం. 
- సుభాష్, డీఈ, నేషనల్ హైవే