బస్టాండ్​కు ఫారెస్ట్ ల్యాండ్ ఇయ్యం.. హెచ్ఎండీఏ ప్రతిపాదనకు కేంద్రం రెడ్ సిగ్నల్ 

బస్టాండ్​కు ఫారెస్ట్ ల్యాండ్ ఇయ్యం.. హెచ్ఎండీఏ ప్రతిపాదనకు కేంద్రం రెడ్ సిగ్నల్ 
  • హెచ్ఎండీఏ ప్రతిపాదనకు కేంద్రం రెడ్ సిగ్నల్ 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ వనస్థలిపురంలోని మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ లో1.354 హెక్టార్లలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం ప్రతిపాదనకు కేంద్రం నో చెప్పింది. బస్టాండ్ నిర్మాణానికి అటవీ భూమిని ఇచ్చేది లేదని ఫారెస్ట్ స్పెషల్ సీఎస్ కు కేంద్ర పర్యావరణ శాఖ డీఐజీ మంజునాథ లేఖ రాశారు. అటవీ భూమిలో ఈ నిర్మాణం పర్యావరణ రూల్స్, గైడ్ లైన్స్ ప్రకారం కరెక్ట్ కాదని లేఖలో పేర్కొన్నారు. ఈ పార్క్ చుట్టూ మూడు వైపులా ఖాళీ జాగా ఉందని లేఖలో ఆయన పేర్కొన్నారు. రాష్ర్ట ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామన్నారు. రూ.10 కోట్ల వ్యయంతో వనస్థలిపురంలో శాటిలైట్ బస్ టెర్మినల్ నిర్మించాలని హెచ్ఎండీఏ మూడేండ్ల కింద నిర్ణయించింది. 

పండుగ సమయాల్లో ఎంజీబీఎస్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో అధిక రద్దీ నేపథ్యంలో ఎల్బీ నగర్ దాటిన తరువాత బస్టాండ్ ఉంటే అక్కడి నుంచే సర్వీసులు స్టార్ట్ చేయెచ్చనే ప్రతిపాదన ఉంది. మెయిన్ రోడ్​పై నేషనల్ పార్క్ ఉండటంతో ఆ స్థలంలో బస్టాండ్ నిర్మాణం కోసం భూమిని హెచ్ఎండీఏకు బదిలీ చేయాలని కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం లేఖ రాసింది. ఇపుడు ఆ ల్యాండ్ ఇవ్వటానికి కేంద్ర పర్యావరణ శాఖ నిరాకరించటంతో ప్రత్యామ్నాయ ల్యాండ్​ను ప్రభుత్వం వెతకనున్నట్లు తెలుస్తోంది.