ఎవరికి బానిసత్వం చేయడానికి ఢిల్లీలో TRS పార్టీ ఆఫీసు

ఎవరికి బానిసత్వం చేయడానికి ఢిల్లీలో TRS పార్టీ ఆఫీసు

ప్రజా సంగ్రామ యాత్రను విమర్శించి ప్రజల్లో పలుచన కావొద్దని టీఆర్ఎస్,కాంగ్రెస్ నాయకులకు సూచించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. 96లో బీజేపీ.. ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదం ఇచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొని మాట్లాడారు రఘునందన్ రావు.

పార్లమెంట్ లో బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కాదన్నారు రఘునందన్ రావు. ఎవరికి.. గులాం గిరి, బానిసత్వం చేయటానికి ఢిల్లీలో పార్టీ కార్యాలయం కడ్తున్నారో TRS చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో స్థలం తీసుకుని..రాష్ట్రంలో ఇతర పార్టీల కార్యాలయాలకు స్థలం ఇవ్వని కుసంస్కారం టీఆర్ఎస్ ప్రభుత్వానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ పాదయాత్రను విమర్శించే నైతికత కాంగ్రెస్ కు లేదన్నారు. తాను చేయలేని పాదయాత్రను బీజేపీ అధ్యక్షుడు చేయటాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు సహించలేకపోతున్నాడన్నారు. అహంకారంతో మాట్లాడిన నేతలు కాల గర్భంలో కలసిపోయారని హెచ్చరించారు.

ఢిల్లీకి హరీశ్ రావు ఎందుకు వెళ్ళలేదు..TRS పార్టీలో తన స్థానమేంటో హరీశ్  చెప్పాలన్నారు. దుబ్బాక, హుజురాబాద్ లో ఎట్టి చాకిరీ చేయటానికి మాత్రమే ఆయన్ను వాడుకుంటున్నారన్నారు. కేసీఆర్.. ఆంధ్ర నేతల మోచేతి నీళ్ళు తాగుతున్నప్పుడే.. బీజేపీ చిన్న రాష్ట్రల ఏర్పాటును సమర్థించిందని గుర్తు చేశారు. గోదావరి జలాల కోసం విద్యాసాగరరావు పాదయాత్ర చేసినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని అన్నారు. తెలంగాణకు హక్కు దారులు తామే అన్నట్లు TRS నేతలు వ్యవహరించటం సరైంది కాదన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. TRS పార్టీకి జలదృశ్యం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే పరామర్శించని చరిత్ర కేసీఆర్ దన్నారు.