హైదరాబాద్, వెలుగు: కస్టడీ వేధింపుల కేసులో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాలను అమలుచేయకపోవడంతో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌పై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. భవానీనగర్ పోలీస్‌స్టేషన్‌లో తనను పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారని మహమ్మద్ షానవాజ్ ఆలం తెలిపారు. ఎలాంటి క్రిమినల్ కేసులు లేకున్నా ఆగస్టు 6న పోలీసులు తనను తీసుకెళ్లి వేధించారని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించారు.
ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆగస్టు 13న సీపీని ఆదేశించింది. అయితే, ఆ ఉత్తర్వులు అమలు కాలేదని షానవాజ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన జస్టిస్ టి.మాధవీదేవి సజ్జనార్‌కు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను నవంబరు 6కు వాయిదా వేశారు.
