కాంట్రాక్టర్ల సమ్మెతో నిలిచిన అభివృద్ధి పనులు

కాంట్రాక్టర్ల సమ్మెతో నిలిచిన అభివృద్ధి పనులు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల సమ్మెతో గ్రేటర్​లో మెయింటెనెన్స్, అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలంటూ 4 రోజులుగా కాంట్రాక్టర్లు పనులు బంద్ పెట్టి సమ్మె చేస్తున్నారు. మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లతో పాటు హౌసింగ్ కాంట్రాక్టర్లు సైతం సమ్మెలో పాల్గొంటున్నారు. డబుల్​ బెడ్రూం ఇండ్ల పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో ఎమర్జెన్సీ పనులు సైతం జరగడంలేదు. పనులు చేయాలంటూ పలు సర్కిల్స్, జోనల్ స్థాయి అధికారులు కాంట్రాక్టర్లను కోరుతున్నారు. బిల్లులు ఇచ్చేంత వరకు పనులు చేయలేమని కాంట్రాక్టర్లు అధికారులకు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే సిటీలో కురిసిన భారీ వానలకు రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఫుట్​పాత్ లు, డ్రెయిన్లు, నాలాల పూడికతీత తదితర పనులు జరగడం లేదు. గ్రేటర్​లో ఏ కాలనీకి వెళ్లి చూసినా రోడ్లపై ఒక్క ఫీట్ మేర గుంతలు తేలాయి. భారీ వానలకు పాట్ హోల్స్​ ఏర్పడ్డాయి. ప్రస్తుతం వానలు తగ్గడంతో రిపేర్లు చేపట్టే టైమ్​లో కాంట్రాక్టర్లు సమ్మెకు దిగడంతో ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయి.

రూ. వెయ్యి కోట్లకు పైగా పెండింగ్

కాంట్రాక్టర్లకు జీహెచ్ఎంసీ దాదాపు రూ.1,150 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో మెయింటెనెన్స్​ పనులు చేసిన వారికి ఈ ఏడాది మార్చి నుంచి  రూ.800 కోట్లు,  ​హౌసింగ్ కాంట్రాక్టర్లకు రూ.350 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉంది.  ఇందులో అత్యధికంగా మార్చి నెల బిల్లులే సగం వరకు ఉన్నాయి. అవి చెల్లించినా పనలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని కాంట్రాక్టర్లు చెబుతున్నప్పటికీ అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. గతంలో కూడా ఇలా సమ్మెకు దిగుతామని ప్రకటించిన టైమ్​లో బిల్లులు చెల్లించారని.. ఈ సారి 4 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. 

సగం పూర్తయిన పనులతో ఇబ్బంది

కాంట్రాక్టర్లు సమ్మె చేస్తుండటంతో ఎమర్జెన్సీ పనులైనా చేయండంటూ సర్కిల్, జోనల్​ స్థాయి అధికారులకు వారిని కోరుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను సైతం మధ్యలోనే వదిలేయడంతో వాటినైనా పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.  గ్రేటర్​లో దాదాపు 400 వరకు  పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ముఖ్యంగా డ్రెయిన్, రోడ్ల పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో జనాలకు ఇబ్బందిగా మారింది.  చాలాచోట్ల పైప్ లైన్ల కోసం గుంతలు తవ్వి అలాగే వదిలేశారు. బిల్లులు ఇస్తే గానీ ఇప్పుడు ఆ పనులు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. 

మార్చి నెల బిల్లులను చెల్లించినా..

చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోతే కొత్త వాటిని ఎలా పూర్తి చేస్తమంటూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సురేందర్​ సింగ్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రూ. వెయ్యి కోట్లకు బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు.  చాలామంది కాంట్రాక్టర్లు అప్పుల పాలయ్యారని.. బిల్లులు రాకపోవడంతో కొద్దిరోజుల క్రితమే పనులకు దూరమయ్యారన్నారు.  కనీసం మార్చి నెలకు సంబంధించిన బిల్లులు ఇచ్చినా తిరిగి పనులు మొదలుపెడతామని ఆయన చెప్పారు.  

త్వరలోనే హెడ్డాఫీసు వద్ద ఆందోళన

బిల్లుల విషయంలో అధికారులు స్పందించకపోవడంతో త్వరలోనే బల్దియా హెడ్డాఫీసు వద్ద పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు అంతా కలిసి ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో కొద్దిరోజుల పాటు ఇలాగే సమ్మెని కొనసాగించి, ఆ తర్వాత కూడా స్పందించకపోతే కాంట్రాక్టర్లు ర్యాలీగా వచ్చి హెడ్డాఫీసు ముందు నిరసన వ్యక్తం చేయనున్నారు.