- ఆర్ అండ్ బీ శాఖలోనే 4 వేల కోట్లు బకాయిలు పెట్టి పోయిన్రు
- బిల్డర్స్ అసోసియేషన్ నేతలతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- పెండింగ్ బిల్స్ చెల్లిస్తామని, సమ్మె ఆలోచన విరమించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: చేసిన పనుల బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరే కారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఒక్క రోడ్లు భవనాల శాఖలోనే కేసీఆర్ సర్కారు రూ.4 వేల కోట్లు పెండింగ్ బకాయిలు పెట్టిందన్నారు. ‘పెండింగ్ బిల్స్ చెల్లిస్తాం.. ఈ నెల 18న జరపనున్న సమ్మె ఆలోచన విరమించండి’ అని బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులను మంత్రి కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో బిల్డర్స్‌తో ఆయన సమీక్ష జరిపారు.
గత బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా నాగర్ కర్నూల్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డిసహా ఆరుగురు కాంట్రాక్టర్ల ఆత్మహత్య ఘటనలు తనను ఎంతగానో కలచివేశాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘అవసరం లేని కాళేశ్వరం వంటి ప్రాజెక్టులపై లక్షన్నర కోట్ల ఖర్చు చేశారు. బ్రాహ్మణ వెల్లంల , ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు" అని చెప్పారు.
కాంట్రాక్టర్లకు రూ.3 వేల కోట్లు చెల్లించినం
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిల చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటిదాకా ఆర్ అండ్ బి శాఖ తరపున కాంట్రాక్టర్లకు రూ.3 వేల కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు విడుదల చేశామన్నారు. ఇంకా రూ.2,500 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ పదేండ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఒక దశలో రూ.8 వేల కోట్లు బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు. యాదాద్రి దేవస్థానం నిర్మాణ పనులు చేపట్టిన సంస్థలకు సైతం ఇప్పటికీ రూ.350 కోట్ల మేర బకాయిలు ఉన్నాయన్నారు.
ఈ నెల 18న ప్రతిపాదించిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విరమించుకోవాలని తెలంగాణ బిల్డర్స్, కాంట్రాక్టర్స్ కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లు, వంతెనలు, అత్యవసర మరమ్మతుల పనులు నిరంతరం కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమయంలో సమ్మె లేదా ఆందోళనల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మంత్రి సానుకూలంగా స్పందించారు: డీవీఎన్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో తమ సమస్యలపై చర్చించామని బిల్డర్స్ అసోసియేషన్ నేత డీవీఎన్ రెడ్డి తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని మంత్రి సానుకులంగా స్పందించారని మీడియాకు తెలిపారు.
