పంచాయతీ సెక్రటరీల బదిలీల్లో వసూళ్ల దందా!..రంగారెడ్డి జిల్లాలో ఊర్లకు భారీగా డిమాండ్

పంచాయతీ సెక్రటరీల బదిలీల్లో వసూళ్ల దందా!..రంగారెడ్డి జిల్లాలో ఊర్లకు భారీగా డిమాండ్
  • ఈ జిల్లాకు ఇటీవల 18 మందికి పోస్టింగ్​
  • వీరి పోస్టింగ్​ కోసం  ట్రాన్స్​ఫర్​ ఆప్షన్లు పెట్టుకోవాలని సెక్రటరీలపై ఒత్తిడి
  • ఒక్కో పోస్టింగ్‌‌కు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు బేరం
  • దిలీకి ఒప్పుకోకుంటే జాతకాలు బయటపెడతామని బెదిరింపులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియలో రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్‌‌ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నిబంధనల ప్రకారం జరగాల్సిన ప్రక్రియను పక్కనబెట్టి కొందరు అధికారులు వసూళ్ల పర్వానికి తెరతీసినట్లు ఆరోపణలొస్తున్నాయి. ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చిన 18 మంది కార్యదర్శులకు డిమాండ్​ ఉన్న గ్రామాల్లో పోస్టింగ్ ఇచ్చేందుకు బేరసారాలు నడుస్తున్నాయి.

 ఈ క్రమంలో జిల్లాస్థాయిలోని ఓ ఉన్నతాధికారి వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ జిల్లాలో 524 గ్రామ పంచాయతీలు ఉండగా.. తాజాగా సంగారెడ్డి, మెదక్ తోపాటు పలు జిల్లాల నుంచి 18 మంది గ్రేడ్-1, 2, 3 కార్యదర్శులు వచ్చారు. వీరికి పోస్టింగ్ ఇచ్చేందుకు ఖాళీలు లేవన్న నెపంతో ప్రస్తుతం పనిచేస్తున్నవారిని బదిలీ కోసం ఒత్తిడి తెస్తున్నారు. నాలుగేళ్లు దాటిన వారు స్వచ్ఛందంగా ఆప్షన్లు ఇచ్చుకునే వెసులుబాటు ఉన్నా.. ఇష్టం లేని వారిని కూడా బలవంతంగా వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. బదిలీకి ససేమిరా అంటున్న సెక్రటరీలకు ఆ అధికారి ఫోన్ చేసి నేరుగా బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. బదిలీకి ఒప్పుకోని పక్షంలో ఆయా కార్యదర్శుల రికార్డులను తీస్తామని, మీరేం చేశారో ‘జాతకాలు’ బయటపెడతామని ఫోన్లలో హెచ్చరిస్తున్నట్లు సమాచారం.

రియల్ ఎస్టేట్ గ్రామాలకు ఫుల్ డిమాండ్

సిటీ శివారుల్లో ఉన్న అబ్దుల్లాపూర్ మెట్, ఇబ్రహీంపట్నం, షాద్ నగర్, శంషాబాద్, కందుకూరు, మహేశ్వరం మండలాలు రియల్ ఎస్టేట్ తోపాటు పరిశ్రమలకు నిలయాలుగా ఉన్నాయి. ఇక్కడ వ్యాపార, వాణిజ్యానికి కేంద్రబిందువుగా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ఆదాయ వనరులు ఎక్కువగా ఉండటంతో ఇక్కడి పోస్టింగ్‌‌ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ గ్రామాల్లో స్థానం దక్కించుకోవాలంటే రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ముట్టజెప్పాలంటూ బేరసారాలు జరుగుతున్నాయని సమాచారం. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. బదిలీల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా కౌన్సెలింగ్ ద్వారా జరగాలి. 

ఏ ఏ గ్రామాల్లో ఖాళీలు ఉన్నాయో ముందే ప్రకటించి, సీనియారిటీ ప్రాతిపదికన కేటాయించాలి. ఇంతవరకు బాగానే ఉన్నా.. రంగారెడ్డి జిల్లాలో కథ వేరేలా ఉండటం చర్చకు దారితీస్తోంది. ఇక్కడ మాత్రం డిప్యూటేషన్ పై ఉన్నవారిని కదిలించకుండా కొన్నేళ్లుగా పనిచేస్తున్న కార్యదర్శులనే టార్గెట్ చేయడం గమనార్హం. పంచాయతీరాజ్​శాఖ బదిలీల నిబంధనలు స్పష్టంగా పేర్కొన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అధికారుల ఆప్షన్లు పెట్టుకోవాలని హుకుం జారీ చేస్తున్నారని సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి ఈ బదిలీల అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతున్నారు.