
- వారమైనా క్లారిటీ ఇవ్వని టీఎస్ పీఎస్సీ
- ఇన్విజిలేటర్ల తప్పిదమన్న కలెక్టర్
- ఇప్పటికీ ఎవ్వరిపైనా చర్యలు తీసుకోని అధికారులు
- ఆ 47 మంది 7 గంటలు సెంటర్లోనే ఎట్లున్నరు?
- అభ్యర్థుల్లో అనుమానాలు.. కోర్టుకు వెళ్లే అవకాశం
హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ తారుమారుపై ఇంకా అనుమానాలు తీరడం లేదు. పరీక్ష జరిగి వారం దాటినా, ఇంకా తప్పు ఎవరిదో టీఎస్ పీఎస్సీ తేల్చలేదు. ఎవ్వరిపైనా చర్యలు తీసుకోలేదు. దీంతో అందరిలో అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నెల16న హైదరాబాద్‌లోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సెంటర్లో జరిగిన గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పై ఇంకా వివాదం కొనసాగుతోంది.
సిటీలోని మూడు సెంటర్లలో 47 మంది అభ్యర్థులకు ఇంగ్లిష్/తెలుగు క్వశ్చన్ పేపర్లకు బదులు ఇంగ్లిష్ /ఉర్దూ లాంగ్వేజీ క్వశ్చన్ పేపర్లు ఇచ్చారు. దీంతో 47 మంది అభ్యర్థులు ఆందోళన చేయడంతో కలెక్టర్ వచ్చి సర్దిచెప్పి పరీక్ష రాయించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరగాల్సిన పరీక్షను, వీరికి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడున్నర వరకూ నిర్వహించారు. ఈ సెంటర్‌తో పాటు సిటీలోని మరో రెండు సెంటర్లలోనూ ఇంకొందరికీ పేపర్లు తారుమారు కాగా, వారికి ఆ మేరకు అదనపు సమయం ఇచ్చారు.
మీడియాలో వచ్చాకే స్పందించిన్రు
మూడు సెంటర్లలో పేపర్ల తారుమారు, పరీక్ష ఆలస్యమైన విషయాన్ని బయటకు చెప్పకుండా అధికారులు మొదట దాచిపెట్టారు. పరీక్ష జరిగిన నాలుగు రోజులకు విషయం మీడియాలో వచ్చిన తర్వాతే అధికారులు స్పందించారు. ఇన్విజిలేటర్, హాల్ సూపరింటెండెంట్ పొరపాటుతోనే ఇలా జరిగిందని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ అమోయ్ కుమార్ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. కానీ వారిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కలెక్టర్ ప్రాథమిక రిపోర్టును అందజేయగా.. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని టీఎస్పీఎస్సీ కోరింది. కనీసం ప్రైమరీ రిపోర్టు ఆధారంగానైనా చర్యలు తీసుకొని ఉంటే కొంత క్లారిటీ వచ్చేది. అయితే, ఎగ్జాం సెంటర్ లో ఆందోళన చేసిన అభ్యర్థులపై టీఎస్పీఎస్సీ అధికారులు కేసులు నమోదు చేసే యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అభ్యర్థుల్లో అనుమానాలు పెరుగుతుండటంతో కొందరు కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు చెప్తున్నారు.
ఇవే అనుమానాలు..
- పరీక్షా టైమ్కంటే 15 నిమిషాలు ముందే గేట్లు మూసేసిన అధికారులు.. షెడ్యూల్ టైమ్ దాటిన తర్వాత మూడు గంటలు పేపర్ ఎలా నిర్వహించారు?
- ఉదయం 8.30 గంటలకు సెంటర్లోకి వెళ్లిన అభ్యర్థులు మధ్యాహ్నం 3.30 గంటల దాకా ఏడు గంటలపాటు ఏం తినకుండా, లోపలే ఎట్లున్నరు?
- కొంతమందికి ప్రత్యేకంగా పేపర్ పెట్టినప్పుడు అదే రోజు ప్రకటన చేయాలి. కానీ మీడియాలో వచ్చేదాకా విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు?
- అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పిన అధికారులు.. ఈ ఇష్యూకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఎందుకు బయటపెట్టడం లేదు?