కిడ్నాప్, హత్య కేసులో దోషిగా తేలిన బీఎస్పీ ఎంపీ డిస్ క్వాలిఫైడ్

కిడ్నాప్, హత్య కేసులో దోషిగా తేలిన బీఎస్పీ ఎంపీ డిస్ క్వాలిఫైడ్

న్యూఢిల్లీ : పరువునష్టం కేసులో అనర్హతకు గురైన కాంగ్రెస్​ మాజీ ఎంపీ రాహుల్  గాంధీ ఉదంతం మరువక ముందే మరో ఎంపీపైనా అనర్హత వేటు పడింది. కిడ్నాప్, హత్య కేసులో దోషిగా తేలడంతో బీఎస్పీ ఎంపీ అఫ్జల్​ అన్సారీపై లోక్ సభ సెక్రటేరియెట్ అనర్హత వేటు వేసింది. ఈ మేరకు సెక్రటేరియెట్  సోమవారం నోటిఫికేషన్​ను విడుదల చేసింది. కిడ్నాప్, హత్య కేసులో ఆయనకు నాలుగేండ్ల జైలుశిక్ష పడింది. ఆయన ఘజియాపూర్​ స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

‘‘అఫ్జల్ ను కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో ఆయన తన లోక్ సభ స్థానానికి అర్హతను కోల్పోయారు. 2023 ఏప్రిల్ 29 నుంచి ఆయనకు అనర్హత వేటు వర్తిస్తుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాం” అని లోక్​సభ సెక్రటేరియెట్  పేర్కొంది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాపూర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అఫ్జల్  అన్సారీని కిడ్నాప్, హత్య కేసులో అక్కడి ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు దోషిగా తేలుస్తూ గత నెల 29న నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. అలాగే అతని సోదరుడు ముక్తాస్  అన్సారీకి కూడా ఇదే కేసులో పదేళ్ల జైలుశిక్ష విధించింది. 1996లో విశ్వ హిందూ పరిషత్  లీడర్  నందకిశోర్​ను వారు కిడ్నాప్  చేశారని, అలాగే 2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్  రాయ్  హత్యలో వారి హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో 2007లో వారిద్దరిపై గ్యాంగ్ స్టర్  నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ జరిపిన ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు వారిద్దరినీ దోషులుగా తేల్చింది.