హైదరాబాద్ సిటీలో తీరని గ్యాస్ కష్టాలు..బుకింగ్ చేసిన రెండు వారాలకు సిలిండర్ డెలివరీ

హైదరాబాద్ సిటీలో తీరని  గ్యాస్ కష్టాలు..బుకింగ్ చేసిన రెండు వారాలకు సిలిండర్ డెలివరీ
  • కొత్తగా  ‘వన్ కనెక్షన్ ​వన్ సిలిండర్​’ పాలసీ  
  • పీఎన్​జీ ఉన్నవారు సిలిండర్​ సరెండర్​ చేయాలని రూల్​ 
  • కొత్త కనెక్షన్ల కోసం 4 లక్షల దరఖాస్తులు అన్నీ పెండింగ్​లోనే...

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​లో వంట గ్యాస్​ కష్టాలు తీరడం లేదు. ఇప్పటికే సిలిండర్​కు మరో సిలిండర్​కు మధ్య బుకింగ్​కు 25 రోజుల గడువు పెట్టిన గ్యాస్​కంపెనీలు.. బుక్​చేసిన తర్వాత డెలివరీ చేయడానికి వారం నుంచి రెండు వారాలు తీసుకుంటున్నాయి. దీంతో వినియోగదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. దీనికి తోడు కొత్తగా వన్​కనెక్షన్​వన్​సిలిండర్​పాలసీ అమలు చేస్తున్నారు. 

ఇందులో భాగంగా పైపుడ్​నేచురల్​గ్యాస్​( పీఎన్​జీ) కనెక్షన్ ఉన్నవారు సిలిండర్ కనెక్షన్ వదులుకోవాలి. గ్రేటర్ లో ప్రస్తుతం 30 వేలకు పైగానే పీఎన్​జీ కనెక్షన్​దారులు ఉండగా, ఇందులో సగం మందికి సిలిండర్​కనెక్షన్​కూడా ఉంది. ఇప్పుడు వీరంతా అంటే 15 వేల మంది వెంటనే సిలిండర్లను స్వాధీనం చేయాల్సి ఉంటుంది. హైటెక్​సిటీ, మాదాపూర్, కొండాపూర్, కూకట్​పల్లి, మియాపూర్, జీడిమెట్ల, కొంపల్లి తదితర ప్రాంతాల్లో పీఎన్​జీ వినియోగదారులు ఎక్కువగా ఉన్నారు. వీరి నుంచి సిలిండర్లను వెనక్కి తీసుకోవడం ద్వారా పెరుగుతున్న బుకింగ్​ల ఒత్తిడిని తట్టుకోవచ్చని ఆయిల్​కంపెనీలు భావిస్తున్నాయి.

కొత్త కనెక్షన్లు ఇస్తలేరు 

గ్రేటర్​లో రోజుకు 5 నుంచి 6 లక్షల వరకు సిలిండర్లు బుక్​అవుతుండగా, డెలివరీ మాత్రం లక్షన్నరకు మించడం లేదు. బుకింగ్​లు, డెలివరీలో కొనసాగుతున్న ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఆయిల్​ కంపెనీలు తాజాగా కొత్త కనెక్షన్ల జారీని పెండింగ్​లో పెట్టాయి. అలాగే సింగిల్​సిలిండర్​ఉన్న వారు రెండో సిలిండర్​ కోసం చేసుకుంటున్న దరఖాస్తులను కూడా పెండింగ్​లోనే పెడుతున్నారు. ఇలాంటివి దాదాపు 4లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయి. 

బ్లాక్ ​మార్కెట్ ​సంగతేంటి? 

గ్యాస్​ డిమాండ్​ను ఎదుర్కోవడానికి కంపెనీలు పైన చెప్పిన పొదుపు చర్యలు తీసుకుంటున్నా, బ్లాక్​ దందాను మాత్రం అరికట్టలేకపోతున్నాయి. ప్రస్తుతం సిటీలో కమర్షియల్, డొమెస్టిక్​సిలిండర్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. కొన్ని చోట్ల డైరెక్ట్​గా డీలర్లు, మరికొన్ని చోట్ల డెలివరీ బాయ్స్​, ఇంకొన్ని చోట్ల ఇద్దరూ కలిసి బ్లాక్​మార్కెట్​లో అమ్ముకుంటున్నారు.