పేపర్ బాటిల్స్‌లో కూల్‌‌డ్రింక్స్‌‌

పేపర్ బాటిల్స్‌లో కూల్‌‌డ్రింక్స్‌‌

ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకూ ప్లాస్టిక్ వాడకం లేకుండా రోజు గడవదు. కానీ ఈ ప్లాస్టిక్ వల్ల కార్బన్ ఎమిషన్స్ పెరగడంతో పర్యావరణంపై ఎఫెక్ట్ మొదలు మన ఆరోగ్యం దెబ్బ తినడం వరకూ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నేండ్లుగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్పొరేట్ కంపెనీలు కూడా తమ వంతుగా ముందుకొస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాస్టిక్‌‌ పొల్యూటర్ అనే ముద్రపడిన కోక కోలా కంపెనీ కూడా కూల్‌‌డ్రింక్స్‌‌ను పేపర్ బాటిల్స్‌‌లో తీసుకురావాలని నిర్ణయించింది. 2030 నాటికి జీరో ప్లాస్టిక్ వేస్ట్ టార్గెట్‌‌గా పెట్టుకుంది. ఇందుకోసం ఈ ఏడాది సమ్మర్‌‌‌‌లో 2 వేల పేపర్‌‌‌‌ బాటిల్స్‌‌తో పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తోంది.

వాటర్ బాటిల్స్, కూల్‌‌డ్రింక్స్, ఆయిల్ డబ్బాలు, ఫుడ్ ప్యాకింగ్ కంటైనర్స్‌‌ ఇలా రకరకాల రూపాల్లో ప్లాస్టిక్ లేని లైఫ్‌‌ని ఊహించుకోవడమే కష్టంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా రోజూ నిమిషానికో లక్ష ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు సేల్ అవుతున్నాయని ఒక అంచనా. ఈ లెక్కన సంవత్సరానికి ఎన్ని వందల కోట్ల ప్లాస్టిక్ బాటిళ్లు వేస్ట్‌‌గా పడేస్తున్నామో కదా! ఆ కోట్ల బాటిళ్లలో రిసైక్లింగ్ జరుగుతున్నది కేవలం ఒకటి, రెండు శాతమే. ఈ బాటిళ్ల వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. భారీగా కార్బన్ ఎమిషన్స్‌‌ రిలీజ్ అవుతున్నాయి. దీని వల్ల క్లైమేట్ చేంజ్‌‌కు కారణమవుతోంది ప్లాస్టిక్. కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యవరణాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో 2019లో పారిస్‌‌లో జరిగిన ఒప్పందంలో పలు దేశాల ప్రభుత్వాలతో పాటు అమెరికా దిగ్గజ డ్రింక్స్ కంపెనీ కోక కోలా కూడా భాగమైంది. దీంతో 2030లోపు తన ప్లాస్టిక్ వాడకాన్ని జీరోకి చేర్చాలన్న ప్రయత్నాలు షురూ చేసింది. పేపర్ బాటిల్స్‌‌లో కూల్‌‌డ్రింక్స్ తీసుకురావడంపై దృష్టి పెట్టింది.

సవాళ్లతో కూడిన ప్రయత్నం

పూర్తిగా 100 శాతం పేపర్‌‌‌‌తో చేసిన బాటిల్‌‌లో కూల్‌‌డ్రింక్స్ తీసుకురావడం అంత ఈజీ కాదు. లిక్విడ్‌‌ను పేపర్ బాటిల్‌‌లో నిల్వ చేయడమంటే చాలా కష్టం. పైగా కోక కోలా డ్రింక్స్‌‌ అన్నీ గ్యాస్‌‌తో నిండి ఉంటాయి. ఆ ప్రెజర్‌‌‌‌ను తట్టుకుని ఆ బాటిల్స్‌‌ నిలవగలగాలి. అంతే కాదు లిక్విడ్ ఆ పేపర్ బాటిల్‌‌లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా దాని టేస్ట్ మారకూడదు. పేపర్‌‌‌‌ ఫ్లేవర్ డ్రింక్‌‌లో కలిస్తే రుచి మారడమే కాదు, దానిని తాగే వాళ్ల హెల్త్‌‌పైనా ఎఫెక్ట్ పడొచ్చు. ట్రాన్స్‌‌పోర్టేషన్, హ్యాండిలింగ్‌‌కు అనుగుణంగా ఉండాలి. ఇలా రకరకాల సవాళ్లతో కూడిన ప్రయత్నాన్ని కోక కోలా ప్రారంభించింది. డెన్మార్క్‌‌కు చెందిన పబోకో కంపెనీతో కలిసి తమకు అవసరమైన రీతిలో పేపర్ బాటిళ్ల తయారీపై సీరియస్‌‌గా వర్క్ చేస్తోంది.

ప్రస్తుతానికి లోపల ప్లాస్టిక్‌‌ లేయర్‌‌‌‌తోనే

కోక కోలా కూల్‌‌డ్రింక్స్ ప్యాకింగ్ కోసం ఇప్పటికే పేపర్‌‌‌‌ బాటిళ్ల ప్రొటోటైప్ రెడీ అయ్యాయి. తొలి ట్రయల్‌‌ రన్‌‌ను హంగేరీలో చేపట్టబోతోంది. ఈ ఏడాది సమ్మర్‌‌‌‌లో ఆ కంపెనీకి చెందిన ప్యాక్డ్‌‌ ఫ్రూట్ జ్యూస్‌‌ ‘అడెజ్’ను పేపర్‌‌‌‌ బాటిళ్లలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే ఇది ప్రయోగాత్మకంగా టెస్టింగ్ కోసమే తీసుకువస్తున్నారు కాబట్టి కేవలం 2 వేల బాటిళ్లను మాత్రమే మొదట రిలీజ్ చేస్తోంది కోక కోలా కంపెనీ. అది కూడా కేవలం హంగేరీలోని ఆన్‌‌లైన్‌‌ గ్రాసరీ వెబ్‌‌సైట్ ‘కిఫ్లీ.హు(Kifli.hu)’లోనే అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఈ బాటిల్‌‌ను అన్ని రకాలుగా ల్యాబ్‌‌లో టెస్టింగ్‌‌ చేశారు. లిక్విడ్, గ్యాస్‌‌ను క్యారీ చేసే కెపాసిటీ దీనికి ఉందని కంపెనీ చెబుతోంది. అయితే ప్రస్తుతం తయారు చేసిన ఈ బాటిల్ 100 శాతం పేపర్ కాదు. లోపలి లేయర్‌‌, మూతను రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్‌‌తో చేశారు. అయితే కంప్లీట్‌‌గా పేపర్‌‌‌‌తోనే బాటిళ్లు తయారు చేయాలన్నది తమ లక్ష్యమని, దీనికి కోసం లోపల భాగాన్ని ఎలా చేయాలన్న దానిపై పార్ట్‌‌నర్ కంపెనీతో కలిసి ప్రయోగాలు చేస్తున్నామని కోక కోలా కంపెనీ టెక్నికల్ సప్లై చెయిన్ & ఇన్నోవేషన్ డైరెక్టర్ డానియెలా జహరియా తెలిపారు.

ప్రెజర్‌‌‌‌ను తట్టుకునేలా..

ఈ పేపర్ బాటిల్స్‌‌ను 10 గ్రాముల పేపర్ ఫైబర్ బేస్డ్ మెటీరియల్‌‌తో తయారు చేశారు. అయితే కేవలం ఇన్నర్ ప్రొటెక్టివ్ లేయర్ కోసం 12 గ్రాముల ప్లాస్టిక్ వాడారు. ఔటర్ బాడీ అంతా ఎటువంటి అతుకులు లేకుండా సింగిల్ షీట్‌‌ పేపర్ ఫైబర్ మెటీరియల్‌‌తోనే చేశారు. లిక్విడ్, గ్యాస్‌‌ను నింపేటప్పుడు ప్రెజర్‌‌‌‌ను తట్టుకునేలా దీనిని డిజైన్ చేసినట్లు పబోకో కమర్షియల్ మేనేజర్ మైకేల్ తెలిపారు. ప్రాడక్ట్‌‌ డిజైన్‌‌లో జాగ్రత్తలు పాటించడంతో పాటు స్ట్రాంగ్ ఫైబర్ మెటీరియల్‌‌ వాడడం వల్ల ఇది ఆ ఒత్తిడిని తట్టుకుంటోందన్నారు. స్ట్రెచ్‌‌ అవ్వగలిగే ఫ్లెక్సిబులిటీ కూడా దీనికి సపోర్ట్ చేసిందని చెప్పారు. ఈ బాటిళ్లను లిక్విడ్ స్టోరేజ్, కాస్మొటిక్స్, హోమ్ కేర్ సహా పలు రంగాల్లో వాడొచ్చని ఆయన అన్నారు.

ప్లాస్టిక్‌‌తో తిప్పలు

ఏటా ఒక్క అమెరికాలోనే 3500 కోట్ల ప్లాస్టిక్ బాటిళ్లను వాడిన తర్వాత వేస్ట్‌‌గా పడేస్తున్నారు. ఇలా భూమి మీద  ఉన్న అన్ని దేశాల్లో కలిపి లక్ష కోట్ల బాటిళ్లు అవుతాయి. ప్లాస్టిక్ రీసైకిలింగ్ జరుగుతున్నా అది కేవలం 2 శాతం లోపే. ఈ ప్లాస్టిక్ అంత ఈజీగా నేలలో కలిసి పోదు కూడా. ఒక్కో బాటిల్ భూమిలో పూర్తిగా కలిసిపోవడానికి వందల ఏండ్ల టైమ్ పడుతుంది. ప్లాస్టిక్ వల్ల కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ అవ్వడమే కాదు.. భూమి పొరల్లో అడ్డం పడడంతో నేల సారం తగ్గిపోతుంది. రకరకాల మార్గాల్లో మనం తాగే నీటిలో సైతం వీటి అవశేషాలు చేరి దానిలోని పాలీ ఇథలీన్ మెటీరియల్ కారణంగా దీర్ఘకాలంలో లంగ్స్, హార్ట్ డీసీజెస్, కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇండియాలో సరఫరా అవుతున్న 80 శాతం నల్లా నీళ్లలో ప్లాస్టిక్ అవశేషాలు ఉంటున్నాయని గతంలో కొన్ని పరిశోధనల్లో తేలింది. ఇక 90 శాతం ప్లాస్టిక్ వేస్ట్ సముద్రంలోకి చేరుతోంది. దీని కారణంగా ఏటా పది లక్షల సముద్ర తీరాల్లో బతికే పక్షులు,  లక్షకు పైగా సముద్ర గర్భంలో ఉండే జీవులు ప్లాస్టిక్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నాయి.

లిక్కర్ కంపెనీలు కూడా ట్రయల్స్ చేస్తున్నయ్

లిక్కర్ కంపెనీలు అబ్జల్యూట్, కాల్స్‌‌బర్గ్‌‌ కూడా పేపర్ బాటిల్స్ ట్రయల్స్‌‌పై దృష్టి పెట్టాయి. పెట్ బాటిళ్ల బదులు వుడ్ ఫైబర్ బేస్డ్​ పేపర్ బాటిళ్లలో బీర్ ప్యాక్ చేసి కన్జ్యూమర్‌‌‌‌ ట్రయల్స్ మొదలు పెట్టాలని కాల్స్‌‌బర్గ్‌‌ భావిస్తోంది. అలాగే అబ్జల్యూట్‌‌ ఇప్పటికే 2 వేల వోడ్కా బాటిళ్లను యూకే, స్వీడన్‌‌లలో మార్కెట్‌‌లోకి తెచ్చింది. అయితే ఈ కంపెనీ తయారు చేసిన బాటిళ్లలో 57 శాతం పేపర్, 43 శాతం రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ మెటీరియల్ వాడారు.

వరుసగా మూడేండ్ల నుంచి టాప్ ప్లాస్టిక్ పొల్యూటర్

ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్లాస్టిక్ వేస్టేజీ కోక కోలా కంపెనీ నుంచే వస్తోందని పలు సర్వేలు తేల్చాయి. బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ అనే ఎన్విరాన్‌‌మెంటర్ గ్రూప్ 55 దేశాల్లో చేసిన సర్వేలో టాప్ ప్లాస్టిక్ పొల్యూటర్‌‌‌‌గా కోక కోలా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో నెస్లే, పెప్సీకో ఉన్నాయి. గడిచిన మూడేండ్లుగా ఈ సంస్థ అధ్యయనాల్లో కోక కోలానే టాప్‌‌లో నిలిచింది. దీంతో రానున్న కొన్ని సంవత్సరాల్లో తమ కంపెనీ నుంచి వచ్చే ప్రతి ప్లాస్టిక్ బాటిల్‌‌ను రీసైకిల్ చేస్తామని 2019లో కోక కోలా ప్రకటించింది. ఇప్పుడు పేపర్ బాటిల్స్ వైపు చూస్తోంది. ఈ ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

For More News..

నర్సరీతో ఆ నలుగురు.. ఉద్యోగాలు పోవడంతో సొంత బిజినెస్

నా వాట్సాప్ చాట్​లను లీక్ చేయొద్దు

తెలంగాణలో ఈ టూరిస్ట్​ ప్లేస్​లని చుట్టొద్దమా..