న్యూఢిల్లీ: సోమవారం నుంచి ప్రారంభం కానున్న 4 రోజుల పార్లమెంట్ సమావేశాలను నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేశామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులపై అర్థవంతమైన చర్చ జరిగేలా ఎంపీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లో అత్యంత కీలకమైన బిల్లులు, అంశాలు చర్చకు రానున్నాయని తెలిపారు.
‘‘పార్లమెంట్ సజావుగా సాగేలా చూడాలని ఎంపీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో ఇప్పటికే మాట్లాడాను. ప్రభుత్వంతో ఏకీభవించడానికి లేదా విభేదించడానికి సభ్యులకు పూర్తి హక్కు, స్వేచ్ఛ ఉన్నాయి. అయితే, పార్లమెంటరీ నిబంధనలు, సంప్రదాయాలకు లోబడి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలి. సభ మాత్రం తప్పనిసరిగా నడవాలి’’ అని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ సభను ప్రోరోగ్ చేయకుండానే తిరిగి సమావేశాలు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయని రిజిజు గుర్తుచేశారు.
