విజయవాడలో ఏప్రిల్‌ 14 వరకు 144 సెక్షన్‌

విజయవాడలో ఏప్రిల్‌ 14 వరకు 144 సెక్షన్‌

విజయవాడలో ఓయువకుడికి కరోనా సోకడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. నగరంలో ఏప్రిల్ 14 వరకు 144 సెక్షన్ విధించింది. ప్రజలంతా సోమవారం నుంచి స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని ఆదేశించింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారంతా తప్పనిసరిగా 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని, ప్రభుత్వ సూచనలను పాటించాలని లేకుంటే చట్ట పరమైన చర్యలు తీసుకుటామని హెచ్చరించారు డీజీపీ గౌతమ్ సవాంగ్. వైరస్ వ్యాప్తి నియంత్రణ నివారణకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లేలా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటిద్దాం

విజయవాడలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఏప్రిల్‌ 14 వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ తిరుమల రావు తెలిపారు. రేపటి నుంచి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘కరోనా సోకిన యువకుడికి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నామని చెబుతున్నారు. అయినా వారికి పరీక్షలు చేసి ఐసోలేషన్‌లో ఉంచుతాం. ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటించాలి. విజయవాడలో కరోనా కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 79952 44260. ఈ నంబర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా కరోనాపై ఫిర్యాదులు చేయవచ్చు’’ అని సీపీ తెలిపారు.

ఈ నెల 17న పారిస్ నుంచి వచ్చిన 21 ఏళ్ల యువకుడికి రెండ్రోజుల తర్వాత కరోనా లక్ణణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేరాడు. అతడి శాంపిల్స్ టెస్ట్ చేయగా.. కరోనా వైరస్‌ సోకిన్నట్లు 21న నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధితుడు ఇంటికి 3 కిలోమీటర్ల పరిధిలో నివాసాలను సర్వే చేశామని, అందరినీ పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, విశాఖల్లో ఒక్కొక్కటి చొప్పున ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.