
పాజిటివ్ కేసుల్లో 62శాతం వారే..
17‑37 ఏండ్ల వారిలో తగ్గుతున్న ఇమ్యూనిటీ
ఒబెసిటీ, అస్తమా, సైనస్ తో కొంత ప్రమాదం
లైఫ్ స్టైల్ డిజార్డర్ తోనూ సమస్య
హైదరాబాద్, వెలుగు : కరోనా కోరల్లో గ్రేటర్ యువత చిక్కుకుంటోంది.‘‘హెల్దీగా ఉన్నం. మాకేమైతది’’ అని నిర్లక్ష్యంగా ఉండేవారే మహమ్మారి బారినపడుతున్నారు. లేట్ నైట్ పార్టీలు, బంక్ స్మోకింగ్ చేసి ఎప్పుడూ జనాల్లో తిరిగేవారే టార్గెట్ అవుతున్నారు.మారిన లైఫ్ స్టైల్ తో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతున్నా.. జాగ్రత్త పడక పోవడంతోనే వైరస్ కి చాన్స్ ఇస్తున్నారని డాక్టర్లు విశ్లేషిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వైరస్ బారిన పడుతున్న వారిలో యువత ముందు వరుసలో ఉంటోంది. కరోనా మొదట్లో ఓల్డేజ్, దీర్ఘకాలిక వ్యాధులు, చంటి పిల్లలకు హాని చేయగా.. ఇప్పుడు ఎక్కువగా బాధితులవుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇప్పటివరకు నమోదైన 6,752 కేసులను విశ్లేషించగా.. 17–37 ఏజ్ గ్రూప్ వారే 3,943 మంది ఉన్నారు. మిగిలిన వారిలో 22శాతం మేర సీనియర్ సిటిజన్లు ఉన్నారు. మిగతా చిన్నపిల్లలు, మైనర్లు. అందులోనూ ఒబెసిటీ, అస్తమా, సైనస్ తో బాధపడుతున్న వారిపై ప్రభావం ఎక్కువగా ఉంది. బాధితుల్లో అన్లాక్ తర్వాత జన సంచారంలో తిరిగిన వారే అధికంగా ఉన్నారు. ఎవరి నుంచి, ఎలా సోకిందనే దానిపై ఎక్కువ శాతం మందికి క్లారిటీలేదు.
కొంపముంచుతున్న లో ఇమ్యూనిటీ
17–37 ఏజ్ గ్రూప్ వారిలో యాంటీ బాడీస్ ఉత్పత్తి మెరుగ్గా ఉంటుంది. కానీ, మారిన లైఫ్ స్టైల్ లో వస్తున్నమార్పులు, ఫుడ్ హ్యాబిట్స్, పోషకాహారం, వ్యాయామం, కోవిడ్ నిబంధనలు పాటించని వారిపైనే వైరస్ తీవ్రంగా ప్రభావంచూపుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు. ట్రీట్మెంట్ లోనూ సీనియర్ సిటిజన్స్ తో పోల్చితే నెమ్మదిగా కోలుకుంటున్నట్లు వెల్లడైంది. క్రిటికల్ కండిషన్ మాత్రం తక్కువని గమనించారు. హెల్త్ విషయంలో నిర్లక్ష్యం గా ఉండడం, శానిటైజర్, మాస్కులు వాడకపోవడం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలను పట్టించుకోకపోవడం వ్యాధి బారినపడటానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
గాడి తప్పిన లైఫ్ స్టైల్
నిజానికి మెట్రో సిటీల్లో ఉండే యువత ఎక్కువగా లైఫ్ స్టైల్ డిజార్డర్ తో బాధపడుతోంది. మెజార్టీ జనం వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు. గంటలపాటు కదలకుండా కూర్చోవడం, ఫుడ్ హ్యాబిట్స్, మానసిక ఆందోళన, పొల్యూషన్ కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. దాంతోపాటు కరోనా వైరస్ బారిన కూడా ఎక్కువగా పడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు.
అధ్యయనాలు చెప్తున్నదీ ఇదే..
ఇటీవల అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధనలు కూడా యువకులు, మధ్య వయస్సు వారిపై కరోనా ఎక్కువ ప్రభావం చూపుతోందని తెలిపాయి. 18–37 ఏండ్ల వయస్సు ఉన్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేకుండానే కోవిడ్ సోకుతోందని 3నెలల అధ్యయనం స్పష్టం చేసింది. ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా యువతలో కరోనా తీవ్రతపై స్పందిస్తూ… వ్యాధి సోకిన నాటి నుంచి పూర్తిగా కోలుకునేందుకు కనీసం రెండు నుంచి
మూడు వారాలకు పైగా పడుతోందని తెలిపింది. ఇమ్యూనిటీ పెంచుకునేలా, మానసిక ఆందోళనకు గురికాకుండా రెస్ట్, డైట్ ఫాలో అయితే వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోందనిపేర్కొంది.