ప్లైట్‌ ఎక్కేటప్పుడు నెగెటివ్‌.. దిగినంక పాజిటివ్‌

ప్లైట్‌ ఎక్కేటప్పుడు నెగెటివ్‌.. దిగినంక పాజిటివ్‌

శంషాబాద్‌ ఎయిర్​పోర్టులో బయటపడుతున్న కేసులు

వేర్వేరు దేశాల ప్రయాణికులు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగుతున్నారు. కరోనా నెగెటివ్‌ రిపోర్టులు చూపిస్తున్నారు. కానీ టెస్టులు చేస్తే మాత్రం పాజిటివ్‌ వస్తోంది. రెగ్యులర్‌గా చేస్తున్న పరీక్షల్లో  చాలా మందికి వైరస్‌ సోకినట్టు తేలుతోందని ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా కన్ఫామ్‌ చేసింది. ఇలాంటి కేసులు రిపోర్టవుతున్నాయని చెప్పింది. అలా ఎంత మందికి పాజిటివ్‌ వస్తోందో మాత్రం వివరాలు వెల్లడించలేదు. మిడిల్‌ ఈస్ట్‌, యూకే నుంచి వస్తున్న వాళ్లకు తప్పనిసరిగా టెస్టు చేస్తున్నామని ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు. అమెరికా, సింగపూర్‌, మాల్దీవుల నుంచి వస్తున్న వాళ్లు 72 గంటల్లో చేసిన ఆర్టీ పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు చూపిస్తే పంపించేస్తున్నామని వివరించారు.

ఇంక్యుబేషన్‌ టైమ్‌ చాలా తక్కువ

వైరస్‌ ఇంక్యుబేషన్‌ సమయం చాలా తక్కువని, కాబట్టి జర్నీ సమయంలోనే వైరస్‌ వృద్ధి చెందే అవకాశం ఉందని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. శరీరంలో వైరస్‌ ఉన్నా ఇంక్యుబేషన్‌ టైమ్‌లోపు టెస్టు చేస్తే నెగెటివ్‌ వచ్చే అవకాశం ఉంటుందని.. అందుకే ఎక్కేటప్పుడు నెగెటివ్‌ చూపించిన ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులో దిగాక టెస్టు చేస్తే పాజిటివ్‌ వస్తోందని వివరిస్తున్నారు. ఇక్కడ ఇంక్యుబేషన్‌ సమయం అంటే వైరస్‌ సోకినప్పటి నుంచి రోగిలో లక్షణాలకు కనిపించే వరకు పట్టే సమయం. సాధారణంగా ఫ్లూ లాంటి వైరస్‌లకు 1 నుంచి 4 రోజులు ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ ఉంటుంది. అయితే వైరస్‌ బాడీలోకి చేరిన రెండ్రోజుల్లోనే లక్షణాలు కనిపించే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు ఇండియా వచ్చేందుకు కొందరు తప్పుడు నెగెటివ్‌ రిపోర్టులు సృష్టిస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు.

మరో 13,034 మందికి వ్యాక్సిన్‌

రాష్ట్రంలో మరో 13,034 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇందులో వృద్ధులు 7,582 మంది, కోమార్బిడ్ పేషెంట్లు 5,437, హెల్త్‌ కేర్‌‌ వర్కర్లు 14,  ఒక ఫ్రంట్‌ లైన్ వర్కర్ ఉన్నారని హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. వీరితో కలిపి వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య 7,24,264కు పెరిగిందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం సూచించినట్టుగా కొవ్యాగ్జిన్ ఫస్ట్‌ డోసు తీసుకున్న వాళ్లకు ఆరు వారాల తర్వాత సెకండ్ డోసు వేయనున్నట్టు తెలిసింది.