కరోనాపై పుకార్లు నమ్మొద్దు: ఈ వైరస్ గాలిలో వ్యాపించదు

కరోనాపై పుకార్లు నమ్మొద్దు: ఈ వైరస్ గాలిలో వ్యాపించదు

కరోనా వైరస్‌పై పుకార్లు నమ్మొద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర కోరారు. ప్రజల్లో లేనిపోని వదంతులు ప్రచారం అవుతున్నాయని, దీనిపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారాయన. ఇవాళ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వస్తే చచ్చిపోతారంటూ పుకార్లు వ్యాప్తిస్తున్నాయని, అది వాస్తవం కాదని, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా వైరస్ సోకిన వారిలో 3 శాతం మాత్రమే మరణించారని చెప్పారు. కరోనా వచ్చినా సరే మామూలు సీజనల్ జలుబు మాదిరిగానే 81 శాతం తగ్గిపోయే చాన్స్ ఉందని తెలిపారు మంత్రి. తీవ్ర స్థాయిలో వచ్చిన వారికి కూడా సరైన సమయంలో చికిత్స అందిస్తే తగ్గుపోతుందన్నారు.

కరోనా వ్యాప్తి నిరోధించేందుకు అన్నిరకాలుగా సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు మంత్రి. అత్యవరసర పరిస్థితి వస్తే ఎదుర్కొనేందుకు పలు ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశామని తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా 104 టోల్ ఫ్రీ నంబర్‌ను అనుమానాలు, సందేహాలను తీర్చేందుకు వినియోగించాలని నిర్ణయించామన్నారు. మాస్కులు కొరత రాకుండా రాష్ట్రానికి మరింత స్టాక్ పంపాలని… ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కోరామని చెప్పారు.

ఈ పుకార్లు నమ్మొద్దు

విదేశాలకు వెళ్లి కరోనా బారినపడి ఇక్కడికి వచ్చిన వారు తప్ప.. ఇప్పటి వరకు మన దేశంలోనే ఉన్న వారికి ఎక్కడా వైరస్ సోకిన దాఖలాలు లేవని తెలిపారు మంత్రి ఈటల. మన దగ్గర ఎండలు ఎక్కువగానే ఉన్నాయని, ఈ వాతావరణ పరిస్థితుల్లో వైరస్ వ్యాపించే అవకాశాలు తక్కువని చెప్పారు. అయితే కరోనా వచ్చిన వారి పక్కన ఉంటే వైరస్ వచ్చేస్తుందని పుకార్లు వ్యాప్తిస్తున్నాయన్నారు. గాలిలో ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. కరోనా ఉన్నవాళ్లు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లు పైన పడితే కరోనా రావచ్చన్నారు. అలాగే ఆ తుంపర్లు పడిన వస్తువులను తాకి.. ఆ తర్వాత నోరు, ముక్కు, కళ్లపై చేతులు పెట్టుకుంటే వైరస్ బారిన పడే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

ఈ జాగ్రత్తలు పాటించండి

కరోనా రాకుండా ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని మంత్రి ఈటల రాజేంద్ర కోరారు. జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన వాళ్లు బయట ఎక్కువగా తిరగొద్దని చెప్పారాయన. ఆలస్యం చేయకుండా డాక్టర్లను కలిసి టెస్టులు చేయించుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు మాస్కు లేదా కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలని కోరారు. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలని, తోటి వారికి వ్యాపించకుండా ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు ఈటల. రోజులో తరచూ చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోగలిగితే 90 శాతం కరోనా రాకుండా చూసుకోవచ్చన్నారు. వదంతులు నమ్మొద్దని, కరోనాపై అవగాహన కల్పించేందుకు అన్ని మాధ్యమాల్లోనూ ప్రచారం చేస్తామని చెప్పారు.