అలుగు- గబ్బిలం కలయికే కరోనా

అలుగు- గబ్బిలం కలయికే కరోనా

సికింద్రాబాద్, వెలుగు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి మన దేశంలో వేగవంతం అయిందని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ (సీసీఎంబీ) మాజీ డైరెక్టర్ డాక్టర్ మోహన్రావు అన్నారు. మన దేశంలో కరోనా వైరస్ స్టేజ్ -2లో ఉందని, దీనిని కమ్యూనల్ ట్రాన్స్మిషన్ గా మారకుండా అడ్డుకోవాలని చెప్పారు. ఇందుకు సామాజిక దూరం పాటించడమే ఏకైక అస్త్రమన్నారు. కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి, తదితర అంశాలపై పలు ప్రశ్నలకు తన సమాధానాలను ఆయన ‘వెలుగు’తో పంచుకున్నారు.

ప్రశ్న: కరోనా ఎలా పుట్టింది?
జ: ఇదొక నిర్జీవమైన ప్రోటీన్ అణువుతో కూడిన పదార్థంగా చెప్పొచ్చు. ప్రతి బ్యాక్టీరియా, వైరస్ జీవితకాలం 20 నిముషాలే. అయితే అవి జంతువులు, మనుషుల శరీరంలో చేరినపుడే వాటి కణాలు మార్పులు చెందుతూ అభివృద్ధి చెందుతాయి. కరోనా వైరస్ అనేది పాంగోలిన్ (ఒంటిపై పొలుసులు ఉండే అలుగు)- గబ్బిలం రెండు జంతువులలో ఒకేలా ఉండే రెండు వేరువేరు జన్యువు ముక్కలు కలిసిపోయి ఏర్పడింది. ఇది ఆ రెండింటి ఆర్ఎన్ఏలో జరిగిన మ్యూటేషన్ ల వల్లనే పుట్టిందని చైనా, ఇటలీ, అమెరికా తదితర దేశాల పరిశోధనల్లో తేలింది. మనదేశంలో వ్యాపించిన వైరస్, చైనాలో మొదలైన వైరస్ ఒకటేనా? దానిలో ఎలాంటి మార్పులు జరిగాయన్నది తేల్చాల్సిన అవసరం ఉంది. మనదేశంలో మొదటిసారి ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి వైరస్ జీనోమ్ తీసుకుని పరిశోధిస్తే ఈ విషయం తెలుస్తుంది. కానీ ఆ వ్యక్తి ఎవరనేది గుర్తించే పరిస్థితి లేదు.

వైరస్ ఎఫెక్ట్ ఎలా ఉంది?
కరోనా వైరస్ మనిషి ఊపిరి తిత్తులలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఎస్-టైపు ప్రోటీన్లపై ప్రభావాన్ని చూపుతుంది. ఊపిరితిత్తులలో శ్వాస జరిగేందుకు అవసరమైన సబ్బులాంటి లూబ్రికేంట్లను విడుదల చేసే టైపు-2 కణాలను అడ్డుకుంటుంది. దీంతో ఆ కణాలు దెబ్బతిని ఉబ్బిపోతాయి. ఫలితంగా సైటోకైనిన్ అనే ఎంజైము విడుదలై రక్తంతో కలసి మెదడుకు చేరుతుంది. దీనివల్ల టెంపరేచర్ పెరుగుతుంది. జ్వరం వస్తుంది. లంగ్స్ లోని ఆల్వియోలైలు మూసుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. లంగ్స్ నుంచి మంచి రక్తం గుండెకు అందడం తగ్గుతుంది. దీంతో బీపీ పడిపోతుంది. కిడ్నీలు, ఇతర అవయవాలు ఫెయిల్ అయి మరణం సంభవిస్తుంది.

కరోనా తీవ్రత ఎలా ఉంది?
ఇటలీ, చైనా, అమెరికా దేశాలతో పోలిస్తే యంగ్ జనరేషన్ ఎక్కువగా ఉండటమే మనకు అడ్వాంటేజ్. ఇది పిల్లలు, 65 ఏళ్లు దాటిన వారిపైనే ఎక్కువ ప్రభావం చూపుతుంది. మన దేశంలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ జాగ్రత్తగా లేకుంటే వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుంది.

కొవిడ్ టెస్టులు ఎలా ఉన్నాయి?
ప్రస్తుతం కొవిడ్ పరీక్షలు జరుగుతున్న తీరు బాగానే ఉంది. అనుమానితులకూ పరీక్షలు చేసేవరకు ఐసోలేషన్లలో పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. దీనిపై ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీలో కొత్త కిట్లు తయారు చేశారు. ఈ కిట్లతో ఒకేసారి కొన్ని వందల మందికి అక్కడికక్కడే టెస్టులు చేసి, నిముషాల్లోనే రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నాయి. ఐసీఎంఆర్ ఆమోదం పొందితే వారంలో అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల కొవిడ్ టెస్టులు మరింత ఈజీ అవుతాయి.

కేసులు ఇంకా పెరుగుతాయా?
దేశంలో 3 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడవచ్చని అమెరికా వంటి దేశాలు చెపుతున్నాయి. ఇది వాస్తవం కాదు. చైనా, ఇటలీ, అమెరికా, స్పెయిన్లతో పోలిస్తే దేశంలో వైరస్ వ్యాప్తి నెమ్మదిగా ఉంది. ఇక్కడ తీసుకుంటున్న జాగ్రత్తలే ఇందుకు కారణం. వైరస్ ఎంత వేగంగా వ్యాపించినా వ్యాధి సోకేవారి సంఖ్య 60 వేలకు మించకపోవచ్చు. ఇప్పుడున్న మెడికల్ ఫెసిలిటీలతో దీన్ని ఎదుర్కోవచ్చు. అయితే వైరస్ మరింత వ్యాపించకుండా చూసుకోవాలి.

For More News..

కరోనాతో బంపర్ ఆఫర్.. రూ. 300 కే పండ్లబుట్ట

ఎన్ఆర్ఐల మధ్య చిచ్చుపెట్టిన కరోనా

క్యూలో ప్రాణాలు.. 15 గంటలైనా హాస్పిటల్‌‌ బయటే పేషెంట్లు

భారత్ లో 9వేలు దాటిన కేసులు