స్విగ్గీ ద్వారా పండ్లు, కూర‌గాయ‌ల డోర్ డెలివ‌రీ

స్విగ్గీ ద్వారా పండ్లు, కూర‌గాయ‌ల డోర్ డెలివ‌రీ

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన క‌రోనా వైర‌స్ యావ‌త్ ప్ర‌పంచం మొత్తాన్ని వ‌ణికిస్తోంది. దాదాపు నాలుగు నెల‌ల్లోపే 24 ల‌క్ష‌ల మందికి పైగా వైర‌స్ బారిన‌పడ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్షా 66 వేల మందికి పైగా ఈ మ‌హ‌మ్మారికి వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల‌తో పోల్చుకుంటే మ‌న దేశంలో క‌రోనా కొంత మేర‌కు కంట్రోల్ లో ఉంది. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా అమెరికాలో ఏడున్న‌ర ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన‌డ‌గా.. 40 వేల మందికి పైగా మ‌ర‌ణించారు. మ‌న దేశంలో ప‌రిస్థితి తీవ్ర‌త‌ను ముందుగా గుర్తించి అప్ర‌మ‌త్తం కావ‌డంతో క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌గ‌లిగింది భార‌త ప్ర‌భుత్వం. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 17,656 మందికి వైర‌స్ సోకింది. వారిలో 559 మంది మ‌ర‌ణించ‌గా.. 2842 పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం క‌రోనా పాజిటివ్ కేసులు 500 కూడా దాట‌క ముందే వైర‌స్ నియంత్ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌మంతా లాక్ డౌన్ విధించింది. అత్య‌వ‌స‌ర‌మైతే తప్ప ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని సూచించింది. దాదాపుగా ప్ర‌జ‌లంతా దీనికి స‌హ‌క‌రిస్తున్నారు. వైర‌స్ ను కొన్ని జోన్ల‌కే క‌ట్ట‌డి చేయ‌డంలో ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డింది.

అగ్రిక‌ల్చ‌ర్, మార్కెటింగ్ శాఖ‌ల భాగ‌స్వామ్యంతో..

లాక్ డౌన్ ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేసేందుకు నిత్యావ‌స‌రాల కోసం కూడా ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాకుండా డోర్ డెలివ‌రీ జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది ఏపీ ప్ర‌భుత్వం. ఆ రాష్ట్రంలో పండ్లు, కూర‌గాయ‌ల‌ను డోర్ డెలివ‌రీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఏపీ అగ్రిక‌ల్చ‌ర్, మార్కెటింగ్ శాఖల‌ భాగ‌స్వామ్యంతో ఫుడ్ డెలివ‌రీ యాప్ స్విగ్గీ ఈ సేవ‌ల‌ను అందించ‌బోతోంది.

థ్యాంక్యూ సీఎం

ఏపీలో కూరగాయలు, ఫ్రూట్స్ డోర్ డెలివరీ చేయబోతున్నట్లుగా స్విగ్గీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఏపీ మార్కెటింగ్ శాఖ భాగస్వామ్యంతో ఈ సేవలను అందుబాటులోకి తేస్తున్నామని చెప్పింది. ఈ సేవలతో రాష్ట్ర ప్రజలు కూర‌గాయ‌ల కోసం ఇళ్లనుంచి బయటకు రావాల్సిన అవస‌రం లేకుండా పోతుందని అభిప్రాయ‌ప‌డింది. ఈ క‌ష్ట స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు త‌మ సర్వీస్ అందించే వీలు క‌ల్పించినందుకు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల‌కు థ్యాంక్స్ చెప్పింది స్విగ్గీ. త్వ‌ర‌లోనే ఇంటి వ‌ద్ద‌కే కూర‌గాయ‌లు, ఫ్రూట్స్ డెలివ‌రీ చేస్తామ‌ని, ప్ర‌జ‌లు ఇంట్లోనే సుర‌క్షితంగా ఉండొచ్చ‌ని పేర్కొంది.