నకిలీ రెమ్డిసివిర్ వేయడంతో కరోనా పేషెంట్​ మృతి

నకిలీ రెమ్డిసివిర్ వేయడంతో కరోనా పేషెంట్​ మృతి
  • ఖమ్మంలోని  ప్రైవేట్ హాస్పిటల్ పై కేసు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: నకిలీ రెమ్డిసివిర్​ ఇంజక్షన్​ వేయడంతో కరోనా పేషెంట్​ఒకరు చనిపోయారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు, మృతుడి కొడుకు సతీశ్​ తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక గొల్లగూడెంకి చెందిన భద్రయ్య అనే వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్ ​అని తేలింది. మెరుగైన ట్రీట్​మెంట్ ​కోసం ఐదు రోజుల క్రితం కుటుంబ సభ్యులు సిటీలోని బాలాజీ చెస్ట్ హాస్పిటల్​లో ​అడ్మిట్​ చేశారు. చికిత్సలో భాగంగా రెమ్డిసివిర్​ ఇంజక్షన్లు చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో ఒక్కోదానికి రూ.30వేలు కట్టేటట్లు మాట్లాడుకున్నారు. మొత్తం ఆరు ఇంజక్షన్లు వేస్తామని చెప్పి మొదట రెండు వేశారు. కాగా భద్రయ్య బుధవారం మృతి చెందారు. నకిలీ రెమ్డిసివిర్ ఇంజక్షన్​ చేయడంతోనే చనిపోయాడంటూ అతని కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్​కు కంప్లైంట్​ చేశారు. స్పందించిన కలెక్టర్​విచారణ చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్​అధికారులను ఆదేశించారు. నకిలీ రెమ్డిసివిర్​ఇచ్చినట్టు అధికారులు దర్యాప్తులో గుర్తించారు. దీనిపై హెల్త్​డిపార్ట్​మెంట్ ​అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ యాజమాన్యంపై కేసు ఫైల్ చేశారు.