కరోనా పేషెంట్లు ఆటోల్లో, క్యాబ్ ల‌లో ఎల్లిపోతున్న‌రు

కరోనా పేషెంట్లు ఆటోల్లో, క్యాబ్ ల‌లో ఎల్లిపోతున్న‌రు

హైదరాబాద్, వెలుగు: వందలాది మంది కరోనా పేషెంట్లను గాంధీ డాక్టర్లు నిర్లక్ష్యంగా ఇంటికి పంపించేస్తున్నారు. డిశ్చార్జి చేసినా కనీసం అంబులెన్సైనా ఏర్పాటు చేస్తున్నారా అంటే అదీ లేదు. దీంతో కరోనా పేషెంట్లు స్వేచ్ఛగా రోడ్లపైకి వచ్చి ఆటోలు, క్యాబుల్లో ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కరోనా ఉన్న సంగతిని డ్రైవర్లకు చెప్పడం లేదు కూడా. దీని వల్ల వైరస్ ఆటో, క్యాబ్ డ్రైవర్లకు, వాళ్ల నుంచి వేరే ప్యాసింజర్లకు సోకే ముప్పున్నా.. అధికారులు పట్టించుకోకుండా పేషెంట్లను వదిలేస్తున్నారు. ఐసీఎంఆర్ రూల్స్కు విరుద్ధంగా ఇష్టమొచ్చినట్టు డిశ్చార్జి చేస్తున్నారు. అయితే, అంబులెన్సుల్లో పంపాలని అడిగినా పట్టించుకునే వారే లేరని, అందుకే తామే ఆటోలు, క్యాబుల్లో వెళ్లిపోతున్నామని కరోనా పేషెంట్లు చెబుతున్నారు.

కరోనా టెస్టులు, పాజిటివ్ వ్యక్తుల కాంటాక్ట్ ట్రేసింగ్, పేషెంట్ల ట్రీట్మెంట్, హోం ఐసోలేషన్చర్యలు.. ఇలా ప్రతి విషయాన్ని అధికారులు లైట్ తీసుకుంటున్నారు. టెస్టుల్లో ఐసీఎంఆర్ రూల్స్ ఫాలో అవుతున్నామంటున్న సర్కార్.. పేషెంట్ల విషయంలో మాత్రం వాటిని పట్టించుకోవట్లేదు. ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారం ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రిలో ఉండాలా లేదా హోం ఐసోలేషన్లో ఉండాలా అన్న దానిని కరోనా పేషెంటే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఐసోలేషన్లో ఉండాలంటే పేషెంట్కు ఇంట్లో అన్ని సదుపాయాలు ఉండాలి. ఇంట్లో హైరిస్క్ వ్యక్తులు ఉండకూడదు. ఇంట్లో వాళ్లంతా కరోనా నివారణ మందుగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ను వేసుకోవాలి. ఐసోలేషన్లో ఉన్న వ్యక్తి ఆరోగ్యాన్ని డాక్టర్లు, సిబ్బంది ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. కానీ, ఇవేవీ రాష్ట్రంలో అమలు కావట్లేదు. అసలు పట్టించుకోవట్లేదు. ఆస్పత్రిలో చేరిన రెండు మూడు రోజులకే లక్షణాలు లేవని చెప్పి పేషెంట్లను ఇంటికి పంపించేస్తున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత కొంత మంది పరిస్థితి విషమిస్తోంది. దీంతో మళ్లీ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. ఈ నెల 6న ఒక్క రోజే గాంధీ నుంచి 310 మందిని హోమ్ ఐసోలేషన్కు పంపించారు. వీళ్లలో కొంతమంది ప్రైవేటు హాస్పిటల్స్లో చేరగా, జ్వరం, దగ్గు ఎక్కువవడంతో శుక్రవారం ఓ ఇద్దరు వ్యక్తులు తిరిగి గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.

ఐసోలేషన్లో అవస్థలు

రాష్ర్టంలో శనివారం నాటికి 2,203 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో సుమారు 1,400 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఒక్క గ్రేటర్లోనే వెయ్యి మందికిపైగా ఉన్నారు. ఓ కరోనా పేషెంట్ హోం ఐసోలేషన్లో ఉన్నారంటే.. ఆ ఇంటి వాళ్లంతా హోమ్ క్వారంటైన్లోనే ఉండాల్సి ఉంటుంది. బయటకు అడుగు కూడా పెట్టకూడదు. కానీ, అధికారులు నిత్యవసరాలను అందించకపోతుండడంతో వాళ్లే బయటకొచ్చి తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్లోని సైదాబాద్కు చెందిన ఓ పేషెంట్ వారం నుంచి ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటున్నాడు. కొన్ని సార్లు తన కొడుకే సామాన్ల కోసం బయటకు పోతున్నాడని అతడు చెప్పాడు. డాక్టర్లు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎట్లుందో అడిగి తెలుసుకుంటున్నారన్నారు. చిన్న చిన్న ఇండ్లలో ఐసోలేషన్లో ఉంటున్న వాళ్ల నుంచి ఇంట్లో వాళ్లకూ వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. కానీ, అధికారులు ఇవేవీ పట్టించుకోకుండానే ఇండ్లకు పంపిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి