
ఏపీలో కొత్తగా మరో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 420కి చేరాయి. శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల మధ్య 931 శాంపిల్స్ టెస్ట్ చేయగా 15 పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గుంటూరు జిల్లాలో 7, నెల్లూరులో 4, కర్నూలు జిల్లాలో 2, కడప, చిత్తూరు జిల్లాలలో ఒక్కో కేసు నమోదైనట్లు వెల్లడింది. కాగా, గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన 52 ఏళ్ల వృద్ధుడు కరోనాతో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తర్వాత మరణించినట్లు వైద్య ఆరోగ్య శాఖ్య తెలిపింది. అయితే అతడి ట్రావెల్, కాంటాక్ట్ హిస్టరీ ఏవీ వెల్లడించలేదు. ఈ మృతితో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య ఏడుకు చేరింది.
65 ఏళ్ల వృద్ధుడు డిశ్చార్జ్
ఇవాళ విజయవాడకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. మార్చి 7న మక్కా నుంచి తిరిగి వచ్చిన ఆ వృద్దుడు కరోనా లక్షణాలతో మార్చి 27న విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. శాంపిల్ టెస్ట్ చేయగా.. పాజిటివ్ రావడంతో వైద్యులు చికిత్స అందించారు. ట్రీట్మెంట్ తర్వాత వరుసగా మూడు సార్లు నెగటివ్ వచ్చాక డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు. ఇప్పటి వరకు మొత్తం 12 మంది డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు.