తెలంగాణ‌లో 1800 దాటిన క‌రోనా కేసులు

తెలంగాణ‌లో 1800 దాటిన క‌రోనా కేసులు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 52 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1813కు చేరింది. తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ శ‌నివారం రాత్రి బులిటెన్ విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 52 కొత్త కేసులు న‌మోదు కాగా.. అందులో 33 మంది జీహెచ్ఎంసీ ప‌రిధిలోని వారేన‌ని తెలిపింది. మిగిలిన 19 కేసుల్లో న‌లుగురు వందే భార‌త్ మిష‌న్ లో భాగంగా కువైట్ నుంచి తిరిగి వ‌చ్చిన వారు, 15 మంది మ‌హారాష్ట్ర‌కు చెందిన వ‌ల‌స కార్మికులు ఉన్నార‌ని చెప్పింది.

గ‌డిచిన 24 గంట‌ల్లో 25 మంది పూర్తిగా కోలుకున్నార‌ని, దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1068కి చేరింద‌ని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. అలాగే కొత్త‌గా ఒక‌రు మ‌ర‌ణించ‌డంతో మొత్తం మృతుల సంఖ్య 49కి చేరిన‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం మొత్తంగా 696 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని పేర్కొంది. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల్లో 59 శాతం పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యార‌ని, 3 శాతం మ‌ర‌ణించార‌ని, 38 శాతం కేసులు యాక్టివ్ గా ఉన్నాయ‌ని ఆరోగ్య శాఖ తెలిపింది.