హౌజింగ్ మినిష్టర్ కు కరోనా పాజిటివ్

హౌజింగ్ మినిష్టర్ కు కరోనా పాజిటివ్

కరోనావైరస్ దేశవ్యాప్తంగా రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటివరకు 23 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే దేశవ్యాప్తంగా నమోదయిన కేసుల్లో 6 వేలకు పైగా కేసులతో మహారాష్ట్ర దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. అక్కడ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో వలస కూలీలు ఎక్కువ ఉండటం, అక్కడ ఇరుకైన ఇళ్లలో జీవనం కూడా కేసులు పెరగడానికి ముఖ్య కారణమైంది. తాజాగా అక్కడ ఒక మంత్రికి కూడా కరోనా సోకిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది.

మహారాష్ట్రలోని ముంబ్రా-కల్వా నియోజకవర్గానికి చెందిన ఎన్‌సిపి ఎమ్మెల్యే, హౌసింగ్ మంత్రి 54 ఏళ్ల జితేంద్ర అవద్ కరోనావైరస్ బారినపడ్డారు. దాంతో ఆయన థానేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కొన్ని రోజుల క్రితం జితేంద్ర భద్రతాసిబ్బందిలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో జితేంద్ర తన కుటుంబానికి చెందిన 15 మందితో హోంక్వారంటైన్ లో ఉన్నారు. ఏప్రిల్ 13కు ముందు ఆయన పరీక్ష చేయించుకోగా కరోనా నెగిటివ్ గా వచ్చింది. అయితే లాక్డౌన్ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై చర్చించడానికి జితేంద్ర ముంబ్రా పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ను కలిసి చర్చించారు. తర్వాత ఆ పోలీసు అధికారికి కరోనా పాజిటివ్ రావడంతో, మంత్రి కూడా పరీక్ష చేయించుకోగా ఆయనకు కూడా పాజిటివ్ గా వచ్చింది. దాంతో పోలీసు నుంచే మంత్రికి కూడా కరోనా సోకినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నుంచి అతని భద్రతా సిబ్బందిలో అయిదుగురికి, ఇంట్లో వంట వాళ్లకు, మరియు మంత్రితో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న మాజీ మంత్రి, ఎన్‌సిపి నాయకుడు ఆనంద్ పరంజాపేకు కూడా కరోనా సోకినట్లు సమాచారం.