సీఎం ఆఫీసులో కరోనా టెన్షన్!

సీఎం ఆఫీసులో కరోనా టెన్షన్!
  • ఓ ఉద్యోగికి పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హైఅలర్ట్
  • 30 మంది నుంచి శాంపిల్స్ సేకరించిన డాక్టర్లు
  • ఇండ్ల నుంచే డ్యూటీ చేయాలని సిబ్బందికి ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని బేగంపేట మెట్రోభవన్ లో ఉన్న సీఎం ఆఫీసులో కరోనా టెన్షన్​ వెంటాడుతోంది. ఆ ఆఫీసులో పనిచేసే ఒక ఎంప్లాయికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. దాంతో ఆఫీసులోని దాదాపు 30 మంది నుంచి శాంపిల్స్ ను సేకరించి టెస్టులకు పంపారు. ఇందులో సీనియర్ ఐఏఎస్ అధికారులు, పేషీ స్టాఫ్, అటెండర్లు, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. రెండు రోజుల కింద ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వద్ద పనిచేసే పర్సనల్​ సెక్రెటరీకి జ్వరం వస్తే హాస్పిటల్​కు వెళ్లారు. అక్కడ టెస్టుల్లో కరోనా పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్ చేశారు. ఆ వ్యక్తి కుమారుడు ఇటీవలే ముంబై నుంచి వచ్చాడని, అతని ద్వారానే వైరస్​సోకిందని అధికారులు గుర్తించారు. ముందుజాగ్రత్తగా సీఎంవోలోని మిగతా సిబ్బందికి టెస్ట్ చేస్తున్నారు. ఇక మెట్రో భవన్ లో పనిచేసే సిబ్బందిలో ఎక్కువ మంది 55 ఏండ్లు నిండిన వాళ్లే ఉండటంతో అలర్ట్​ అయ్యారు. సీఎంవో ఆఫీసు మొత్తం శానిటైజ్ చేశారు. ఇక తాత్కాలిక సెక్రటేరియట్ లో పనిచేసే ఓ అటెండర్ కు కరోనా పాజిటివ్ ఉందని ప్రచారం జరిగింది. దీనిపై అధికారులు ఆరా తీయగా.. కరోనాతో చనిపోయిన ఓ సమీప బంధువు అంత్యక్రియలకు హాజరైనట్టు ఆ అటెండర్​ వెల్లడించాడు. అతన్ని హోం క్వారంటైన్​లో ఉండాల్సిందిగా ఆదేశించారు.

సీఎంవోకు తాళం?

సీఎంవోలో ఒకరికి పాజిటివ్ రావడంతో కొన్ని రోజుల పాటు ఆఫీసుకు ఎవరు రావద్దని ఆదేశించినట్టు తెలిసింది. ఇండ్ల నుంచే డ్యూటీ చేయాల్సిందిగా చెప్పినట్టు సమాచారం. సీఎం సెక్రెటరీలు కూడా తమ ఇండ్ల నుంచే ఫైల్స్ చూస్తున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి చీఫ్ అడ్వైజర్ రాజీవ్ శర్మ మెట్రో భవన్ కు రావడం మానేశారని.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా కూడా ఉండటంతో.. అక్కడికే వెళ్తున్నారని అధికారులు చెప్తున్నారు.

టెస్టులు ఎక్కువ చేస్తే ఇండియా అమెరికాను మించిపోయేది