
గోదావరిఖని, వెలుగు: కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ యువకుడు బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. గోదావరిఖని సూర్యనగర్‌కు చెందిన కాంపెల్లి శ్రీనివాస్(35) పట్టణంలోని బేకరీలో సూపర్ వైజర్‌గా చేస్తున్నాడు. తీవ్ర జ్వరం, దగ్గు రావడంతో పది రోజుల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్‌లో కరోనా టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. అయినా జ్వరం తగ్గకపోవడంతో స్కానింగ్ చేయించుకోవడంతో కరోనా పాజిటివ్‌గా తేల్చారు. తీవ్ర ఆందోళనకు గురైన శ్రీనివాస్ హాస్పిటల్‌కు వెళుతున్నానని ఇంట్లో చెప్పి కార్పొరేషన్ ఆఫీస్సమీపంలోని తీన్ రస్తా వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకున్నాడు. అప్పుడే ధర్మారం నుంచి గోదావరిఖని వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు రెడ్ సిగ్నల్ పడడంతో ఆగింది. తిరిగి గ్రీన్ సిగ్నల్ పడడంతో బస్సు బయలుదేరగానే వెనక టైర్ కింద తలపెట్టి పడుకోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీనివాస్ మృతదేహం దగ్గరకు ఎవరూ వెళ్లలేదు. రాజీవ్ రహదారి కావడంతో సుమారు రెండు గంటల పాటు వెహికల్స్నిలిచిపోయాయి. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ జి.రమేశ్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని కొవిడ్ రూల్స్ప్రకారం కార్పొరేషన్ సిబ్బందితో మృతదేహాన్ని గోదావరి నదికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేయించారు. భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
పాజిటివ్ అని తెలిసి గుండెపోటు
తల్లాడ, వెలుగు: కరోనా పాజిటివ్ అని తెలియడంతో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన దంతాల యాలాద్రి(60) అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం కుటుంబసభ్యులు ఖమ్మంలో ట్రీట్మెంట్చేయించేందుకు 108లో తీసుకెళ్లే క్రమంలో తల్లాడ పీహెచ్సీలో కరోనా టెస్ట్ చేశారు. కరోనా పాజిటివ్ అని వైద్య సిబ్బంది చెప్పడంతో కుప్పకూలిపోయిన యాలాద్రి అక్కడే మృతిచెందాడు.