60 శాతానికి చేరువ‌లో క‌రోనా రిక‌వ‌రీ రేటు

60 శాతానికి చేరువ‌లో క‌రోనా రిక‌వ‌రీ రేటు

దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు క్ర‌మంగా మెరుగుప‌డుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 13,158 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య 3,47,979కి చేరింది. దీంతో మొత్తం క‌రోనా కేసుల్లో రిక‌వ‌రీ రేటు గ‌ణ‌నీయంగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 59.43 శాతానికి చేరింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ బుధ‌వారం సాయంత్రం ట్వీట్ చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌మ‌న్వ‌యంతో క‌రోనా నియంత్ర‌ణ‌, వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌లు సత్ప‌లితాల‌ను ఇస్తున్నాయ‌ని అన్నారు. క‌రోనా రిక‌వ‌రీ రేటు 59.43 శాతానికి పెరిగింద‌ని చెప్పారు. అలాగే ప్రస్తుతం క‌రోనాతో చికిత్స పొందుతున్న యాక్టివ్ పేషెంట్ల క‌న్నా ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య ల‌క్ష 30 వేలు ఎక్కువ‌ని కేంద్ర‌మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ తెలిపారు.

గ‌డిచిన‌ 24 గంటల్లో దేశంలో క‌రోనా చికిత్స పొందుతూ 507 మంది మరణించగా, కొత్తగా 18,653 కరోనా కేసులు నమోదయ్యాయ‌ని బుధ‌వారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,85,493కి చేరగా, మరణించినవారి సంఖ్య 17,400కు పెరిగింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 2,20,114 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,47,979 మంది బాధితులు కోలుకున్నారు. జూన్‌ 30 వరకు 86,26,585 పరీక్షలు చేశామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్ (‌ ICMR) ప్రకటించింది.