ఉస్మానియా ఆస్పత్రిలో నూ కరోనా టెస్ట్‌‌‌‌‌‌‌‌లు

ఉస్మానియా ఆస్పత్రిలో నూ కరోనా టెస్ట్‌‌‌‌‌‌‌‌లు
  •                 కొవిడ్ సోకిన వ్యక్తి కోలుకున్నాడు
  •                 ఎయిర్ పోర్ట్ లో ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేస్తున్నాం
  •                 కరోనా విషయంలో అలర్ట్ గా ఉన్నాం : ఈటల

కరోనా వైరస్ టెస్టులు ఉస్మానియా హాస్పిటల్ లోనూ చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. త్వరలోనే ఇక్కడ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా బాధితుడు పూర్తిగా కోలుకున్నాడని… రాష్ట్రంలో కొత్తగా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని మంత్రి చెప్పారు. మంగళవారం కోఠిలోని కమాండ్‌‌ కంట్రోల్‌‌ సెంటర్‌‌ లో మీడియాతో మాట్లాడారు. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉన్నామని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేయాలని డాక్టర్లకు సూచించామన్నారు. అవసరమైన వారికి టెస్ట్ లతో పాటు హోమ్ ఐసోలేషన్ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.  ఒక స్టాండింగ్ థర్మల్ స్క్రీనింగ్, 3 హాండ్ స్క్రీనింగ్‌‌లతో ఎయిర్ పోర్ట్ లో స్క్రీనింగ్ చేస్తున్నామని మరో 2 స్టాండింగ్ థర్మల్ స్క్రీనింగ్‌‌లు త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. కరోనా వైరస్ విషయంలో ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తో మాట్లాడుతున్నానని…అన్ని దేశాల్లో కరోనా ప్రభావం ఉన్నందున విదేశాల నుంచి మన  దేశానికి వచ్చే వారందరికీ అన్ని ఎయిర్ పోర్ట్ లలో స్క్రీనింగ్ చేయాలని కోరామన్నారు.  అన్ని ఎయిర్ పోర్ట్ లలో థర్మల్ స్క్రీనింగ్ చేయిస్తామని కేంద్రం మంత్రి హామీ ఇచ్చారని ఈటల తెలిపారు.

గాంధీకి  26  కొవిడ్‌‌ సస్పెక్టెడ్ కేసులు

కొవిడ్  లక్షణాలతో గాంధీ హాస్పిటల్‌‌లో మంగళవారం మరో 26 మంది వ్యక్తులు అడ్మిట్ అయ్యారు.  వీరిని ఐసోలేషన్ వార్డుల్లో అబ్జర్వేషన్‌‌లో ఉంచామని, శాంపిల్స్‌‌ సేకరించి టెస్టుల కోసం పంపించామని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.  ఇందులో ఐదుగురికి నెగెటివ్‌‌ రాగా 21 మంది రిజల్ట్స్‌‌రావాల్సి ఉంది.  బుధవారం వీరి రిజల్ట్స్ వస్తాయని డాక్టర్లు చెప్పారు. ఇప్పటి వరకు 286 మందికి పరీక్షలు చేయగా, 264 మందికి వైరస్ లేదని నిర్ధారణ అయ్యింది.  21 మంది రిజల్ట్స్  రావాల్సి ఉంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పదిహేను రోజుల్లో  41,102 మందికి స్క్రీనింగ్ చేశారు. అటు ప్రభుత్వానికి 2 లక్షల అపోలో మాస్క్ లు ఇచ్చేందుకు యశోద హాస్పిటల్ ముందుకు వచ్చింది. ఇప్పటికే 1.20 లక్షల మాస్క్ లు అందజేయగా బుధవారంలోగా మరో 80 వేల మాస్కులను ఇస్తామని తెలిపింది.