ప్రైవేట్ లో కరోనా దందా..పర్మిషన్ లేకుండా టెస్టులు

ప్రైవేట్ లో కరోనా దందా..పర్మిషన్ లేకుండా టెస్టులు

నిజామాబాద్, వెలుగు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండగా, జనాలు అదే రేంజ్​లో భయపడుతున్నారు. కరోనా లక్షణాలు లేని వారికి కూడా టెస్టుల్లో పాజిటివ్ అని వస్తోంది. దీంతో తమకూ ఉందేమో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాష్ట్ర సర్కార్ కోవిడ్ లక్షణాలు ఉన్నోళ్లకు మాత్రమే టెస్టులు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వం చేతులెత్తేసినట్టుగా వ్యవహరిస్తోందనే అభిప్రాయానికి జనాలు వచ్చారు. ఈ నేపథ్యంలో కరోనా టెస్టులు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని నగరంలోని ఓ ప్రైవేట్​హాస్పిటల్ యాజమాన్యం క్యాష్​చేసుకుంటోంది. ఆ హాస్పిటల్ చేస్తున్న కొవిడ్​దందాపై ఇతర హాస్పిటళ్ల యాజమాన్యాలు జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.

సర్కార్ పర్మిషన్ ఇచ్చిందని..

కరోనా టెస్టులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ఎంపిక చేసిన ప్రైవేట్ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్​సెంటర్లకు మాత్రమే పర్మిషన్​ఇచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏ హాస్పిటల్ కు పర్మిషన్​ఇవ్వలేదు. కానీ నగరంలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యం తమకు ప్రభుత్వం పర్మిషన్​వచ్చిందని ప్రచారం చేసుకుంది. కొద్దిరోజులుగా కరోనా టెస్టుల కోసం పలువురి నుంచి శాంపిల్స్ సేకరిస్తోంది. వాటిని హైదరాబాద్ కు పంపి రిపోర్ట్స్ ఇస్తోంది. ప్రభుత్వం హైదరాబాద్​లోని ప్రైవేట్ డయాగ్నోస్టిక్​సెంటర్లలో టెస్ట్​చేయించుకుంటే రూ.2,200 ఫీజుగా నిర్ణయించింది. కానీ వీళ్లు ఒక్కొక్కరి నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.

హాస్పిటల్లోనే ఐసోలేషన్

కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్లను తమ హాస్పిటల్​లోనే ఐసోలేషన్​ లో ఉంచుకుని రోజుకు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాజిటివ్​వచ్చిన వారు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో హాస్పిటల్ లోనే ఉంటున్నారు. హోంఐసోలేషన్​లో ఉండాల్సిన వారికి కూడా భయానికి గురిచేసి తమ హాస్పిటల్​లోనే ఉండేలా చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

జీజీహెచ్‌‌‌‌‌‌‌‌లో టెస్టులు తీవ్ర ఆలస్యం

నిజామాబాద్ జీజీహెచ్‍లో కొవిడ్​టెస్టులు సోమవారం నుంచి షురూ చేయనున్నారు. ఇక్కడి వైరాలజీ ల్యాబ్ లో ఇప్పటికే ట్రునాట్‍, సీబీనాట్‍, ఆర్‍టీపీసీఆర్ అత్యాధునిక మెషిన్లతో చేయనున్నారు. ప్రస్తుతం ట్రయల్స్​కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి కొద్ది రోజులు అత్యవసరమైన వారికి మాత్రమే టెస్టులు చేయనున్నారు. సర్కార్ స్థానికంగా కరోనా టెస్టులు చేయకపోవడం, జీజీహెచ్​లో మెషిన్లు అందుబాటులోకి తీసుకురావడంలో తీవ్ర జాప్యం చేయడం ప్రైవేట్​హాస్పిటళ్ల కొవిడ్ దందాకు కారణమవుతోందని పలువురు అంటున్నారు.