
- మంత్రి కేటీఆర్‌కు పాజిటివ్
- ప్రగతిభవన్‌లో 15 మందికి సోకిన వైరస్
- హోం ఐసోలేషన్‌లో ఐఏఎస్‌లు, ఆఫీసర్లు
- సెక్రటేరియట్లోనూ పెరిగిన బాధితులు
- ఆఫీసులకు వచ్చేందుకు జంకుతున్న మంత్రులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా సెకండ్ వేవ్ దెబ్బ తగిలింది. సీఎం కేసీఆర్ వైరస్ బారిన పడి ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్‌కు కూడా పాజిటివ్ వచ్చింది. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్.. కరోనా నుంచి కోలుకుని డ్యూటీకి వస్తున్నా ఆయన పేషీలో పనిచేసే సిబ్బంది రోజుకు కొందరు వైరస్ బారిన పడుతున్నారు. ఐఏఎస్ లు,సెక్రటేరియట్, హెచ్ఓడీ ఆఫీసుల్లో పనిచేసే సిబ్బంది, మంత్రుల పేషీల్లో పనిచేసే ఉద్యోగులకు కరోనా వచ్చింది. దీంతో సెక్రటేరియట్ లో విజిటర్స్‌కు అనుమతి లేదని ప్రకటించారు. మరోవైపు సెకండ్ వేవ్ ప్రభావం పాలన వ్యవహారాలపై పడింది. పలు ఫైళ్లు పెండింగ్ లో పడ్డాయి.
ఐసోలేషన్‌లో తండ్రీకొడుకులు
నాలుగు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌కు పాజిటివ్ రావడంతో ఆయన తన ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం మంత్రి కేటీఆర్‌కు కరోనా సోకినట్లు తేలడంతో ఆయన కూడా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ‘‘స్వల్ప లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్‌లో ఉన్నా. ఈ మధ్య నన్ను కలిసిన వారంతా కరోనా టెస్టు చేయించుకుని జాగ్రత్తగా ఉండండి’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతకుముందు రోజు ఎంపీ సంతోష్ కుమార్ కూడా వైరస్ బాడిన పడ్డారు. సీఎం కేసీఆర్ కు పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత ఆయన వెంటే వీరిద్దరూ ఉన్నారు. కేటీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లి కేసీఆర్ ను కలిసి వచ్చారు. కేసీఆర్ వెంటే ఫామ్‌హౌస్‌లో సంతోష్ ఉన్నారు. గతంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌కు పాజిటివ్ రావడంతో చికిత్స తీసుకున్నారు.
వైరస్ గుప్పిట్లో సెక్రటేరియట్
తాత్కాలిక సెక్రటేరియట్ బీఆర్కే బిల్డింగ్ మొత్తం వైరస్ గుప్పిట్లో చిక్కుకుంది. అందులో పని చేస్తున్న స్టాఫ్ లో చాలా మంది వైరస్ బారిన పడుతున్నారు. దీంతో బీఆర్కే బిల్డింగ్ కు వచ్చే విజిటర్స్ పై ఆంక్షలు విధించారు. సంబంధిత ఆఫీసర్ అనుమతి ఉంటేనే లోపలికి పంపిస్తామని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. అర్జెంట్ పనుల మీద వచ్చే వారికి స్ర్కీనింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతించనున్నట్టు పేర్కొన్నారు. సెక్రటేరియట్ కు వచ్చే వారంతా ఫేస్ మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. శుక్రవారం సీఎస్ పేషీలో పని చేసే స్టాఫ్‌లో ఇద్దరు వైరస్ బారిన పడగా.. గురువారం నలుగురికి పాజిటివ్ వచ్చింది. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో సుమారు 30 మందికి కరోనా సోకింది. ఇప్పటికే అగ్రికల్చర్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి హోమ్ ఐసోలేషన్ ఉన్నారు.
మంత్రులు.. ఇంటి నుంచే పని
సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మంత్రులు తమ ఆఫీసులకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఇంటి నుంచే పని చేస్తున్నారు. అది కూడా అర్జెంట్ ఫైల్స్ ఉంటేనే సంతకాల కోసం ఇంటికి రావాలని ఆఫీసర్లకు చెప్తున్నారు. వివిధ పనుల కోసం వచ్చే విజటర్స్ కు అనుమతి లేదని మంత్రుల పీఏలు చెప్తున్నారు. కొందరు మంత్రుల పేషీల్లో పనిచేసే సిబ్బందికి పాజిటివ్ రావడంతో వారు హోం ఐసోలేషన్ ఉన్నారు.
ఫైల్స్ పెండింగ్
అర్జెంట్ ఫైల్స్ తప్పా మిగతా ఫైల్స్ ను ఆఫీసర్లు, మంత్రులు చూడటం లేదు. పీఆర్సీ ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేయకపోవడంతో ఉద్యోగులకు పెరిగిన జీతాలు ఇవ్వట్లేదు. స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ పంపిన ప్రపోజల్ పెండింగ్‌లోనే ఉంది. సీఎం కేసీఆర్ ఐసోలేషన్ లో ఉన్నందున ఫైల్స్ చూడట్లేదని అధికారులు తెలిపారు. ఈ మధ్య సీఎం కేసీఆర్ అనుమతి కోసం అగ్రికల్చర్, ఆర్ అండ్ బీతోపాటు పలు శాఖలు పంపిన ఫైల్స్ పెండింగ్ లో ఉన్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు.
ప్రగతిభవన్, ఫామ్‌హౌస్‌లో కరోనా కలకలం
సీఎం కేసీఆర్ కు పాజిటివ్ అని తేలిన తర్వాత ప్రగతిభవన్, పామ్‌హౌస్‌లో పని చేస్తున్న సిబ్బందికి టెస్టులు చేయించారు. ప్రగతిభవన్ లో సుమారు 15 మందికి కరోనా వచ్చినట్టు తెలిసింది. ఇందులో పోలీసు స్టాఫ్ కూడా ఉన్నట్టు సమాచారం. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పనిచేసే పలువురు సిబ్బందికి వైరస్ సోకినట్టు తెలిసింది. కేసీఆర్, కేటీఆర్, సంతోష్ కుటుంబ సభ్యులు అందరూ టెస్టులు చేయించుకున్నట్టు సమాచారం.