సీఎం హామీ ఇచ్చి ఆర్నెల్లయినా.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలే

సీఎం హామీ  ఇచ్చి ఆర్నెల్లయినా.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలే
  • మళ్లీ మొదలైన కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీ
  • బిల్లులు కట్టేందుకు ఆస్తులు అమ్ముకుంటున్న జనం
  • గతంలో ఎన్నో ఫిర్యాదులు..  స్పందించని సర్కారు
  • గవర్నమెంట్​ దవాఖాన్లలో సౌలతులు అంతంతే
  • టిమ్స్​లో సీటీ స్కాన్​ మెషీన్​ కూడా అందుబాటులో లేదు

హైదరాబాద్, వెలుగు:  కరోనా ట్రీట్​మెంట్​ను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పి ఆరు నెలలవుతున్నా ఇంతవరకూ దానిపై సడీసప్పుడు లేదు. కరోనా సెకండ్​ వేవ్​ ప్రభావంతో రాష్ట్రంలో  కేసులు, హాస్పిటళ్లకు వచ్చే వాళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని హాస్పిటళ్లలో కరోనా వార్డులు ఫుల్ అయ్యాయి. ఇదే అదునుగా కార్పొరేట్‌‌, ప్రైవేట్ హాస్పిటళ్లు మళ్లీ తమ దోపిడీ దందాను మొదలుపెట్టాయి.  బిల్లుల మోతతో ముప్పుతిప్పలు పెడుతున్నాయి. బిల్లులు కట్టేందుకు పేషెంట్లు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తోంది. అయినా సర్కారు పట్టించుకోవడం లేదు. కరోనా ట్రీట్‌‌మెంట్‌‌ను కనీసం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడం లేదు. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనే తప్ప, దానికి సంబంధించిన చర్చలు ఏమీ జరగలేదని హెల్త్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసర్లు చెప్తున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటే ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లతో సంప్రదింపులు తప్పనిసరి. కానీ, ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి తమకు పిలుపు రాలేదని హాస్పిటళ్ల అసోసియేషన్లు అంటున్నాయి.  60% మంది ప్రైవేట్‌‌కే కరోనా ట్రీట్‌‌మెంట్‌‌ కోసం ప్రభుత్వ దవాఖాన్ల కంటే, ప్రైవేట్‌‌ హాస్పిటళ్లకు వెళ్లేందుకే జనం మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో అన్ని వసతులు, మందులు, డాక్టర్లను అందుబాటులో ఉంచామని సర్కార్ పెద్దలు చెప్తున్నా, ప్రైవేట్‌‌లోనే అడ్మిట్‌‌ అవుతున్నారు. హెల్త్ డిపార్ట్‌‌మెంట్ లెక్కల ప్రకారం బుధవారం నాటికి రాష్ట్రంలో  3,345 మంది కరోనా పేషెంట్లు హాస్పిటళ్లలో ఉన్నారు. ఇందులో 2,420 మంది ప్రైవేట్‌‌,  కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉండగా, 925 మంది మాత్రమే ప్రభుత్వ దవాఖాన్లలో ట్రీట్​మెంట్​ పొందుతున్నారు. 

ప్రభుత్వ దవాఖాన్లలో అన్ని ఏర్పాట్లు చేశామని, అన్ని పరికరాలు ఉన్నాయని ఆఫీసర్లు చెప్తున్నా వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. కరోనా పేషెంట్‌‌ ట్రీటింగ్‌‌లో సీటీ స్కాన్ రిపోర్ట్‌‌ చాలా ముఖ్యం. కొవిడ్ నోడల్ దవాఖానగా ఉన్న టిమ్స్‌‌లో ఇప్పటివరకూ సీటీ స్కాన్​ యంత్రం లేదు. నిరుడు ప్రభుత్వ దవాఖాన్లలో ఆక్సిజన్ అందక పలువురు పేషెంట్లు చనిపోయారు. పదిహేను రోజుల కిందట్నే వరంగల్‌‌ ఎంజీఎంలో వెంటిలేటర్‌‌‌‌ సకాలంలో పెట్టకపోవడంతో ఓ యువకుడు ప్రాణాలొదిలాడు. ఇలాంటి పరిస్థితులను చూసి ప్రభుత్వ దవాఖాన్లకు పోవాలంటే  కరోనా పేషెంట్లు  భయపడుతున్నారు. ఒకవేళ ప్రైవేట్‌‌ దవాఖాన్లకు వెళ్లే వాళ్లంతా ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చినా, కేసులు పెరుగుతున్న కొద్దీ మేనేజ్‌‌ చేసే కెపాసిటీ సర్కార్ దవాఖాన్లకు లేదు. ప్రస్తుతం దవాఖాన్లలో ఉన్న 3,345 మందిలో 905 మంది సీరియస్‌‌ కండీషన్‌‌లో వెంటిలేటర్‌‌‌‌పైన ఉన్నారు. ఇందులో 677 మంది ప్రైవేట్‌‌లో ఉంటే, 238 మంది గవర్నమెంట్‌‌ ఫెసిలిటీస్‌‌లో ఉన్నారు. జిల్లా హాస్పిటళ్లు, టీచింగ్ హాస్పిటళ్లు అన్ని కలిపినా వెయ్యి వెంటిలేటర్లు అందుబాటులో లేవు. చిన్న చిన్న హాస్పిటళ్లలో ఐసీయూ, వెంటిలేషన్లు ఉన్నా పేషెంట్‌‌ను మేనేజ్‌‌ చేయగల స్పెషలిస్టులు ఆయా దవాఖాన్లలో అందుబాటులో లేరు.  దీంతో కేసులు పెరుగుతున్న కొద్దీ పేషెంట్లు తప్పనిసరి పరిస్థితుల్లో  ప్రైవేట్‌‌కు వెళ్లాల్సి వస్తోంది.
ఫిర్యాదులు వచ్చినా నో రెస్పాన్స్​
ప్రైవేట్, కార్పొరేట్​ హాస్పిటళ్ల బిల్లుల దందాను మంత్రులు, సీఎం సహా లీడర్లందరూ గతేడాది అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆ అంశాన్ని పరిశీలించేందుకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌‌లతో టాస్క్‌‌ఫోర్స్ కమిటీని కూడా వేశారు. అయినా దోపిడీ ఆగలేదు. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో లేదో కూడా సర్కార్ చెప్పలేదు. ఒక్క దవాఖానపైనా చర్యలు తీసుకోలేదు. వేల సంఖ్యలో ఫిర్యాదులొచ్చినా హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌ ఒకట్రెండు దవాఖాన్లపైనే చర్యలు తీసుకుంది. ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకపోతే ఎట్ల అని ఆఫీసర్లను ప్రశ్నిస్తే ప్రైవేట్ హాస్పిటళ్లను మూసేస్తే ఎక్కువ మంది పేషెంట్లు చనిపోతారని ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. కరోనా ట్రీట్​మెంట్​ను  ఆరోగ్యశ్రీలో చేర్చొచ్చుగా అంటే.. అది ప్రభుత్వం చేతిలోని నిర్ణయం అని అంటున్నారు. 

అప్పట్ల జీవో అన్నరు.. సగం బెడ్లన్నరు.. ఏమాయె?

కరోనా పేషెంట్లను తొలి నుంచే కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లు దోచుకుంటున్నాయి. దీంతో ఫీజుల నియంత్రణకు గత జూన్‌‌లో ప్రభుత్వం ఓ జీవో విడుదల చేసింది. దాని ప్రకారం చార్జ్‌‌ చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్‌‌, హెల్త్ మినిస్టర్ హెచ్చరించారు. జీవో ప్రకారం చార్జీలు వేస్తారని ట్రీట్‌‌మెంట్ కోసం కార్పొరేట్ హాస్పిటళ్లకు వెళ్లిన పేషెంట్లకు దోపిడీ తప్పలేదు. ట్రీట్‌‌మెంట్ అందిస్తున్న అన్ని దవాఖాన్లు జీవోను ఉల్లంఘించి అడ్డగోలు చార్జీలు వసూలు చేశాయి. ఆఫీసర్లు ఒక్క హాస్పిటల్‌‌లోనూ జీవో అమలు చేయించలేకపోయారు. సగం బెడ్ల ఫార్ములా అంటూ సర్కార్ పెద్దలు మరోసారి హడావుడి చేశారు. ప్రైవేట్‌‌, కార్పొరేట్ హాస్పిటళ్లలోని సగం బెడ్లను తీసేసుకుంటున్నామని, వీటిలో తక్కువ చార్జీలకే ట్రీట్‌‌మెంట్ ఇప్పిస్తామని జనాల్లో మరోసారి ఆశలు రేకిత్తించారు. ఒక్కో పేషెంట్ వద్ద గరిష్టంగా రూ.4 లక్షలకు మించి చార్జ్‌‌ చేయొద్దని హాస్పిటళ్లకు కండీషన్‌‌ పెట్టారు. ఇందుకు హాస్పిటళ్ల యాజమాన్యాలు ఒప్పుకోకముందే అందరూ ఒప్పుకున్నారని ప్రకటనలు గుప్పించారు. యాభై శాతం బెడ్లు అటుంచి 50 బెడ్లు కూడా ఇచ్చేందుకు ప్రైవేటోళ్లు ఒప్పుకోకపోవడంతో ప్రభుత్వ పెద్దలే వెనక్కి తగ్గారు. సర్కార్ దవాఖాన్లలోని బెడ్లన్నీ నిండిన తర్వాతే  ప్రైవేట్‌‌లో బెడ్లు తీసుకుంటామన్నారు. తర్వాత ఆరోగ్యశ్రీలోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం చెప్పడంతో జనాల్లో మరోసారి ఆశలు చిగురించాయి. ఆరునెలలు అవుతున్నా అదీ అమల్లోకి రాలేదు.  

ఆరోగ్యశ్రీలో చేర్చితే రూపాయి కూడా కట్టనవసరం లేదు

కరోనా సాధారణ ఐసోలేషన్‌‌కు చిన్న ప్రైవేట్​ హాస్పిటళ్లలో రోజుకు రూ. 5 వేల నుంచి రూ.10 వేల వరకు బిల్లు వేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో రోజుకు రూ. 10 వేల నుంచి 20 వేలు వసూలు చేస్తున్నారు. ఆక్సిజన్ అవసరమైతే చిన్న హాస్పిటళ్లలోనే రోజుకు రూ. 20 వేల నుంచి 35 వేలు, కార్పొరేట్ హాస్పిటళ్లలో రోజుకు రూ. 30 వేల నుంచి 50 వేలు చార్జ్ చేస్తున్నారు. వెంటిలేషన్‌‌ వరకూ వెళ్తే లక్షల్లో బిల్లు అవుతోంది. ఒక్కో పేషెంట్‌‌ కనీసం రూ. లక్షన్నర ఖర్చు అవుతుండగా, రూ. పది, పదిహేను లక్షల బిల్లు అవుతున్నవారూ ఉన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేరిస్తే ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. 

రెండ్రోజుల్లో రూ.70 వేలు

మా నాన్నకు దమ్ము వస్తుండడంతో మంగళవారం రాత్రి ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌కు తీసుకపోయినం. ఆర్టీపీసీఆర్ నెగటివ్ వచ్చిందని అక్కడి డాక్టర్‌‌‌‌కు చెబితే, సీటీ స్కాన్  చేయాలన్నరు. సీటీ స్కాన్​ రిపోర్ట్ చూసి కరోనా ఉందని చెప్పిన్రు. దమ్ము ఎక్కువకావడంతో అక్కడి నుంచి కింగ్ కోఠి దవాఖానకు తీసుకపోయినం. ‘బెడ్లు ఖాళీగా లేవ్. హోమ్‌‌ క్వారంటైన్‌‌కు వెళ్లండి’ అని అక్కడున్న ఓ డాక్టర్  చెప్పిన్రు.  ‘దమ్ము వస్తోంది.. ఆక్సిజన్ పెట్టండి..’ అని వేడుకున్నం. దీంతో ఇంకో డాక్టర్‌‌‌‌ టిమ్స్‌‌కు వెళ్లాలని చెప్పిన్రు. వెంటనే టిమ్స్‌‌కు పోతే.. కరోనా పాజిటివ్ వస్తేనే అడ్మిట్​ చేసుకుంటామని టిమ్స్‌‌ వాళ్లు అన్నరు. లంగ్స్‌‌ ప్రాబ్లం ఉందని, సీటీ స్కాన్ చూపిస్తే గాంధీ హాస్పిటల్​కు పొమ్మన్నరు. అప్పటికే నాన్నకు దమ్ము ఇంకింత ఎక్కువయింది. దీంతో గాంధీ దవాఖాన్ల కూడా అడ్మిట్‌‌ చేసుకుంటరో లేదోనని వనస్థలిపురంలోని ఓ  ప్రైవేట్ హాస్పిటల్​ల  చేర్పించినం. రెండ్రోజుల్లోనే  రూ. 70 వేల బిల్లు వేసిన్రు. ఇంక ఎంత అయితదో తెల్వదు.   

- రవిందర్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌, 
బైరామల్‌‌‌‌గూడ, హైదరాబాద్​