స్టాక్ మార్కెట్లలో డబ్బు సంపాదించాలని ఉందా..? నిపుణుల పెట్టుబడి సూచన ఇదే..

స్టాక్ మార్కెట్లలో డబ్బు సంపాదించాలని ఉందా..? నిపుణుల పెట్టుబడి సూచన ఇదే..

చాలా మంది తాము చేస్తున్న ఉద్యోగం లేదా వ్యాపారం నుంచి వచ్చే డబ్బులో కొంత దాచుకుని పెట్టుబడిగా పెడుతుంటారు. దీనిని వారు అదనపు ఆదాయ మార్గంగా భావిస్తుంటారు. అయితే చాలా మందికి వేలల్లో ఉండే షేర్లలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడ రాబడులు బాగున్నాయి, స్థిరమైన రాబడులను ఏవి అందిస్తున్నాయి వంటి విషయాలపై అవగాహన తక్కువగా ఉంటుంది. పైగా తాము చేసిన పెట్టుబడులకు తక్కువ రాబడులు వచ్చినప్పుడు మార్కెట్లను నిందిస్తుంటారు. 

మంచి స్మాల్ క్యాప్ స్టాక్స్ దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించినట్లు నిపుణులు సూచించారు. ఇటీవల బజాజ్ ఫిన్ సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బహిర్గతం చేసిన సమాచారంలో గడచిన 7 సంవత్సరాలుగా స్మాల్ క్యాప్ సెగ్మెంట్ మంచి రాబడులను అందించినట్లు వెల్లడించింది. దీంతో స్మాల్ క్యాప్ కేటగరీ మార్కెట్ క్యాప్ 2017లో 17 ట్రిలియన్ రూపాయల నుంచి 2024 చివరి నాటికి 92 ట్రిలియన్ రూపాయలకు పెరిగినట్లు డేటా వెల్లడించింది. ఇక్కడ ఇన్వెస్టర్ల డబ్బు వార్షికంగా 27.6 శాతం చొప్పున రాబడిని అందించింది.

ఇదే కాలంలో లార్జ్ క్యాప్ స్టాక్స్ 14.5 శాతం రాబడిని అందించగా.. మిడ్ క్యాప్ స్టాక్స్ 21.6 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు అందించగలిగాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ 50 ఇండెక్స్ గడచిన 19 ఏళ్ల కాలంలో 14 సంవత్సరాల పాటు నిఫ్టీ స్మాల్ క్యాప్ 250ని అధిగమించిందని బజాజ్ ఏఎంసీ రిపోర్ట్ వెల్లడించింది. దీని ప్రకారం క్వాలిటీ స్మాల్ క్యాప్ స్టాక్స్ తమ ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో మెరుగైన అలాగే స్థిరమైన రాబడులను తెచ్చిపెట్టాయి.

►ALSO READ | ఇజ్రాయెల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ బిల్డింగ్‌పై మిసైల్ దాడి.. ఇరాన్ దూకుడు..

స్మాల్ క్యాప్ కేటగిరీలో ట్రాన్స్ ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ స్టాక్ గడచిన రెండేళ్ల కాలంలో 1132 శాతం రాబడిని అందించి అత్యుత్తమ పనితీరును కనబరిచింది. ఇదే క్రమంలో వోకార్డ్ట్, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్, ఐఎఫ్‌సీఐ, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, జెఎస్‌డబ్ల్యు హోల్డింగ్స్, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కంపెనీ షేర్లు 365 శాతం నుంచి 703 శాతం మధ్య పెరుగుదలతో ఇన్వెస్టర్లకు భారీ రాబడులను అందించాయని ACE ఈక్విటీ డేటా సూచిస్తోంది. మెుత్తం మీద భారత మార్కెట్లలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలపై ఇన్వెస్టర్లు బలమైన నమ్మకాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోందని ఈక్వినోమిక్స్ రీసెర్చ్ ప్రతినిధి జి చోక్కలింగం పేర్కొన్నారు. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.