ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో విదేశాల్లో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ లకు టీమిండియా వెళ్లడం లేదని బీసీసీఐ వెల్లడించింది. జూన్ 24 నుంచి శ్రీలంక టీమ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆ దేశం వెళ్లాల్సి ఉంది. అలాగే ఆగస్టు 22 నుంచి మొదలయ్యే మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటించాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఈ రెండు దేశాల్లో పర్యటనకు టీమిండియా వెళ్లడం లేదని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా శుక్రవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.
మరోవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో టీమిండియా శ్రీలంక, జింబాబ్బే టూర్లను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. ఈ వన్డే, టీ20 సిరీస్‌లను మళ్లీ ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై ఇంకా రీషెడ్యూలింగ్ తేదీలను ఖరారు చేయలేదని తెలిపింది.

