టెన్త్ గ్రేడింగ్ తో సంబంధం లేదు..మా టెస్టు పాసైతేనే..

టెన్త్ గ్రేడింగ్ తో సంబంధం లేదు..మా టెస్టు పాసైతేనే..

హైదరాబాద్, వెలుగు“టెన్త్ ఇంటర్నల్ మార్కులతో స్టూడెంట్లకు వచ్చిన గ్రేడింగ్​తో మాకు సంబంధం లేదు. మేము పెట్టిన టెస్టులో వచ్చిన మార్కులే ప్రామాణికం. దీని ఆధారంగానే ఫీజులుంటాయి”రెండు రోజులుగా రాష్ట్రంలోని అనేక కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు చేస్తున్న ప్రచారమిదీ. క్యాంపెయిన్​ చేయడమే కాదు.. కాలేజీ స్టాఫ్ స్టూడెంట్ల ఇండ్లకు వెళ్లి మరీ వారిని టెస్టులకు తీసుకుపోతున్నారు. కొన్ని కాలేజీలైతే ఈ నెల 15 నుంచి ఆన్​లైన్ క్లాసులు కూడా ప్రారంభిస్తామని ప్రచారం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఇంటర్ బోర్డు అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

అడ్మిషన్ల వేటలో కాలేజీలు

రాష్ట్రంలో 2,558 జూనియర్‌‌ కాలేజీలుండగా, వాటిలో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు1,583 ఉన్నాయి. వాస్తవానికి జూన్1 నుంచి జూనియర్ కాలేజీలు మొదలు కావాలి. కరోనా ఎఫెక్ట్, లాక్ డౌన్​వల్ల తరగతులు వాయిదాపడ్డాయి. మరోవైపు టెన్త్ పరీక్షలపై మొన్నటి వరకూ సస్పెన్స్ కొనసాగింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయినా కార్పొరేట్ కాలేజీలు మార్చి నుంచే అడ్మిషన్ల వేట మొదలుపెట్టాయి. లాక్​డౌన్ టైంలోనూ స్టూడెంట్లకు టెస్టులు పెట్టాయి. నెల క్రితం నిజాంపేటలో ఓ కార్పొరేట్ కాలేజీ అడ్మిషన్ టెస్టు పెట్టగా.. స్టూడెంట్​ యూనియన్లు అడ్డుకున్నాయి. కొన్ని రోజులుగా మరికొన్ని కాలేజీలు కూడా టెస్టులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

టెన్త్ మార్కులు లెక్కలోకి రావట

కరోనా వల్ల ఇంటర్నల్ మార్కుల ఆధారంగా స్టూడెంట్స్​ కు గ్రేడింగ్ ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మార్కులను కార్పొరేట్ కాలేజీలు లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇదివరకు టెన్త్​లో స్టూడెంట్లకు వచ్చే మార్కుల ఆధారంగా ఫీజుల్లో రాయితీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు దాదాపు అన్ని కాలేజీలూ సొంతంగా టెస్టులు పెడుతున్నాయి. వాటిలో వచ్చే మార్కుల ఆధారంగానే ఫీజుల్లో రాయితీ ఇస్తామని చెప్తున్నారు. దీంతో పేరెంట్స్​ కూడా పిల్లలను టెస్టులు రాయించేందుకు పంపుతున్నారు.

గుర్తింపు లేకుండానే అడ్మిషన్లు

అన్ని కాలేజీలకు ఏటా ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఇస్తుంటుంది. మార్చిలో రూల్స్​ ప్రకారం లేని 68 కార్పొరేట్ కాలేజీలను మూసేసింది. రాష్ట్రంలోని కాలేజీలన్నీ అఫిలియేషన్​కు అప్లై చేసుకునే దశలోనే ఉన్నాయి. అయినా కొన్ని కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్లు మొదలుపెట్టాయి. టెన్త్​లో అందరినీ పాస్ చేయడంతో రెండు రోజులుగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాలేజీల్లో సిబ్బంది లేకపోవడంతో, డిగ్రీ స్టూడెంట్లను టెంపరరీ సిబ్బందిగా నియమించుకుని, వారితో స్టూడెంట్స్​కు ఫోన్లు చేయిస్తున్నాయి.

జురాల పక్కన మరో రిజర్వాయర్