అగ్నిపథ్ కు కార్పొరేట్ల మద్దతు

అగ్నిపథ్ కు కార్పొరేట్ల మద్దతు

ఓ వైపు దేశవ్యాప్తంగా అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతుంటే... మరో వైపు  బడా కార్పొరేట్లు అగ్నిపథ్ కు పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఆనంద్ మహీంద్రా నుంచి మొదలు టాటా వరకు చాలా కార్పొరేట్ కంపెనీలు మోడీ పథకానికి బాసటగా నిలుస్తున్నాయి. నాలుగేళ్ల తర్వాత 25 శాతం మందిని మాత్రమే శాశ్వత ప్రాతిపదికన తీసుకుని... మిగిలిన వారిని బయటకు పంపిస్తామని స్కీంలో పేర్కొనడంతో దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగింది. అలా చేస్తే మిగిలిన వారు జీవితాంతం నిరుద్యోగులుగా ఉండాల్సిందేనా అంటూ ఆర్మీ అభ్యర్థ్తులు, ప్రతి పక్షాల నాయకులు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ అధిపతులు స్పందించారు. నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చిన వారికి తమ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాల కల్పిస్తామని ప్రకటించారు. అగ్నిపథ్ మంచి స్కీం అని, దేశ రక్షణకు అదెంతో ఉపయోగపడుతుందని వారంతా కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే కార్పొరేట్లకు సంబంధించి ఎవరెవరు ఏమన్నారో చూద్దాం... 

ఆనంద్ మహీంద్రా

అగ్నిపథ్ చాలా మంచి స్కీం అని అగ్నిపథ్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నానంటూ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. ఈ పథకం ద్వారా యువత క్రమశిక్షణతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలు సంపాదించకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.  నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు కార్పొరేట్ రంగంలో మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయన్న ఆయన...  పరిపాలన, టీం లీడర్లు, ఫిజికల్ ట్రైనర్లు వంటి పలు విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఇక అగ్నివీరులకు మహీంద్రా కంపెనీ తలుపులు ఎల్లప్పుడూ తరిచే ఉంటాయని ప్రకటించారు.


టాటా గ్రూప్

టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్ర శేఖరన్ కూడా అగ్నిపథ్ కు దన్నుగా నిలిచారు. అగ్నిపథ్ వల్ల దేశ రక్షణకు ఉపయోగపడే వీరులను తయారుకావడమే కాదు... ఇతర రంగాలకు కూడా క్రమశిక్షణ, మంచి నైపుణ్యాలతో కూడిన యువత లభిస్తుందని అభిప్రాయపడ్డారు. అగ్నివీరులకు తమ కంపెనీలో ఉద్యోగాల కల్పిస్తామంటూ ఆయన ప్రకటించారు.

బయోకాన్  లిమిటెడ్ కంపెనీ

దేశ రక్షణ రంగంలో అగ్నిపథ్ అనేది గొప్ప సంస్కరణ అని సంస్థ ఎక్జిగ్యూటివ్ చైర్మన్ కిరణ్ మజుందార్ షా అన్నారు. ఈ పథకంతో యువతకు ఎన్నో లాభాలున్నాయని ఆమె చెప్పారు. ఇప్పటికే తమ కంపెనీలో 60 నుంచి 100 మంది వరకు ఎక్స్ సర్విస్ మెన్ కు అవకాశం కల్పించినట్లు పేర్కొన్న ఆమె... అగ్నివీరులను తమ కంపెనీలోకి తసీుకుంటామని చెప్పారు. టెక్నాలజీ మీద పట్టు సాధించడం ద్వారా అగ్ని వీరులకు కార్పొరేట్ సంస్థల్లో మంచి ఉద్యోగాలు ఉంటాయని స్పష్టం చేశారు. 

ఆర్పీజీ గ్రూప్

గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా అగ్నిపథ్ కు సపోర్టు చేశారు. తమ కంపెనీలో అగ్నివీరులకు తప్పకుండా అవకాశం ఉంటుందన్న ఆయన... మిగతా కంపెనీలు కూడా అగ్నివీరులకు అండగా నిలవాలని చెప్పారు. అగ్నిపథ్ వల్ల దేశం మరింత స్ట్రాంగ్ గా తయారవుతుందని తెలిపారు.

జేఎస్డబ్ల్యూ గ్రూప్

అగ్నపథ్ తో దేశ రక్షణ వ్యవస్థ మరింత కట్టుదిట్టంగా తయారవుతుందని సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్ అన్నారు. యువతకు శిక్షణ ఇవ్వడంలో ఆర్మీని మించింది మరొకటి లేదన్నారు. స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్, సింగపూర్ వంటి దేశాల్లో యువత కచ్చితంగా కొంత కాలం పాటు ఆర్మీలో చేయాల్సి ఉంటుందని చెప్పారు. అతి పెద్ద దేశమైన మనకు అగ్నివీరులు వరంలా మారుతారని ఆయన స్పష్టం చేశారు. అగ్నివీరులకు తమ కంపెనీలో కచ్చితంగా ఉద్యోగాలుంటాయని ప్రకటించారు. 

అపోలో హాస్పిటల్స్

అగ్నిపథ్ భాగంగా నేర్చుకునే క్రమశిక్షణ, ఇతర స్కిల్స్ తో అగ్నివీరులకు ఎక్కడైనా జాబ్స్ వస్తాయని జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి అన్నారు. ఇక తమ కంపెనీలో కూడా తప్పకుండా జాబ్స్ ఇస్తామని తెలిపారు. 

ఎడ్జ్ కంపెనీ

అగ్నిపథ్ కు తాము మద్దతు ఇస్తున్నట్లు కంపెనీ కో ఫౌండర్ సంజీవ్ భిక్ఛందనీ ప్రకటించారు.  అగ్నివీరులు ప్రైవేట్ కంపెనీల పాలిట వరంలా మారుతారని ఆయన అభిప్రాయపడ్డారు. అగ్నివీరులకు తమ కంపెనీలో జాబ్స్ ఇస్తామని చెప్పారు.