పనికో రేటు.. ఏండ్లుగా తిష్ట మండలాల్లో ఆర్ఐల అవినీతి లీలలు

పనికో రేటు..  ఏండ్లుగా తిష్ట మండలాల్లో ఆర్ఐల అవినీతి లీలలు
  • ఇటీవల బయటపడ్డ అక్రమాల్లో ఆర్ఐలదే కీలకపాత్ర 
  • చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్న రెవెన్యూ అధికారులు

సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేట జిల్లాలో ఏళ్లుగా రెవెన్యూశాఖలో  పాతుకుపోయిన ఆర్ఐలు అవినీతి, అక్రమాల్లో ఆరితేరిపోయారు.  ఇటీవల జిల్లాలో రెవెన్యూశాఖలో బయటపడ్డ అవినీతిలో ఆర్ఐలదే కీలకపాత్ర పోషించినట్లు తేలింది. ఏండ్ల తరబడి మండలాల్లో తిష్ట వేసిన ఆర్ఐలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతూ పైసలు లేనిది పని చేయని పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున ఆర్ఐల అక్రమాలు బయటపడుతున్న ఉన్నతాధికారులు ముడుపులు తీసుకొని మౌనం వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

పనిని బట్టి రేటు 

కల్యాణ లక్ష్మీ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, బర్త్, డెత్ సర్టిఫికెట్, అగ్రికల్చర్ ఇన్కమ్, ల్యాండ్ ఎంక్వైరీ చేసి ఆర్ఐలే సర్టిఫికెట్స్ ఇవ్వాల్సి ఉండగా ఒక్కో పనిని బట్టి ఒక్కో రేట్ ఫిక్స్ చేసుకొని దండిగా వసూళ్లు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కల్యాణ లక్ష్మీకి రూ. 2 వేల నుంచి రూ.5 వేలు, అండర్ ఏజ్ వారికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు 20 పర్సెంటేజ్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కొరకు రూ. 3 వేల నుంచి రూ.5 వేలు, అగ్రికల్చర్ ఇన్కమ్ కోసం ఎకరాకు రూ. 2 వేల చొప్పున వసూళ్లు చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. దీంతో ఏండ్ల తరబడి ఆర్ఐలుగా కొనసాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

చర్యలు తీసుకోని ఆఫీసర్లు  

జిల్లాలో ఆర్ఐలు భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు.  ఇటీవల జిల్లాలో బయటపడ్డ అక్రమాల్లో ఆర్ఐల పాత్ర బయటపడ్డ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.  చిలుకూరు మండలానికి చెందిన  ఆర్ఐ సొంత మండలంలో సుమారుగా 5 ఏండ్ల నుంచి బదిలీ కాకుండా ఇక్కడే ఉంటూ ఓసీ, బీసీలకు ఎస్టీ, ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్స్ జారీ చేయగా వాటిని గ్రామ పంచాయితీ ఎన్నికల్లో రిజర్వేషన్ కోటాలో నామినేషన్ వేయడంతో అభ్యర్థులు క్యాస్ట్ పై అభ్యంతరాలు చెప్పడంతో ఎంక్వైరీ చేసిన అధికారులు క్యాస్ట్ సర్టిఫికెట్ లను రద్దు చేశారు.

అయితే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించినా అధికారులు మాత్రం ఎలాంటి పొరపాటు లేదని క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఎంక్వైరీ చేసిన ఉన్నతాధికారి, ఆర్ఐది ఒకే సామాజిక వర్గం కావడంతోనే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల మోతే మండలంలో రికార్డులను ట్యా౦పరింగ్ ఆరోపణలతో మోతే ఆర్ఐ పై కేసులు పెట్టి జైలుకు పంపించినా ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మరో మండలానికి బదిలీ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన కూడా దాదాపు నాలుగు ఏండ్లుగా ఆర్ఐ గా కొనసాగడం గమనార్హం. సూర్యాపేట ఆర్ఐ 7 సంవత్సరాలు, గరిడే పల్లి ఆర్ఐ 8 సంవత్సరాలు, ఆత్మకూరు (ఎస్) 4 ఏండ్లు, నడిగూడెం ఆర్ఐ 6 , నేరేడు చర్ల ఆర్ఐ ఆరేళ్లుగా కొనసాగుతున్నారు. 

ఏండ్ల తరబడి ఆర్‌‌ఐలుగానే..

రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ల ప్రమోషన్ అనంతరం రెండేళ్ల పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌‌గా పని చేయాలన్న సర్వీస్ రూల్స్ ఉన్నాయి. అయితే సీనియర్ అసిస్టెంట్లకు ఆదాయం వచ్చే అవకాశం లేకపోవడంతో ఆర్ఐలుగా పని చేస్తూ మండలాల్లో ఏండ్ల తరబడి పాతుకుపోయి అక్రమాలకు పాల్పడుతున్నారు.

ముఖ్యంగా సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో ప్రమోషన్ పొందినప్పటికీ దాన్ని పక్కన పెట్టి ఏండ్ల కొద్ది ఆర్ఐలుగా నే కొనసాగుతున్నారు. ఆర్ఐలుగా కొనసాగేందుకు ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు సమర్పిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించి బదిలీ ప్రక్రియ చేపట్టాలన్న డిమాండ్ ఉంది.