హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకుల సొసైటీ హెడ్ ఆఫీస్‌లో 8 మంది అధికారులపై ఓయూ స్టూడెంట్స్జేఏసీ నేతలు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, సీఎస్, ఏసీబీ డీజీ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేసి, సమగ్ర నివేదిక ఇవ్వాలని గురుకుల సొసైటీ సెక్రటరీని ఎస్సీ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఆదేశించారు. 8 మందిలో సూపరింటెండెంట్లు వేణుగోపాల్, రవీష్, హారిక, సునంద, అజ్రా, శ్రీప్రియతో పాటు అసిస్టెంట్ సెక్రటరీ వాణికుమారి, డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్ ఉన్నారు.
కారుణ్య నియామకాల కింద జిల్లాల్లో నియమితులైన కొందరు నిబంధనలకు విరుద్ధంగా హెడ్ ఆఫీస్‌లో పనిచేస్తున్నారని , మరికొందరు ఏపీలో ఉద్యోగాల్లో చేరి తెలంగాణకు వచ్చారని, డిగ్రీ కాలేజీల్లో సూపరింటెండెంట్ పోస్టుల్లో ప్రమోషన్ పొందిన వెంటనే హెడ్ ఆఫీస్‌కు డిప్యూటేషన్‌పై వచ్చి కొనసాగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టెండర్ల సమాచారం లీక్ చేసి కమిషన్లు తీసుకుంటున్నారని, అకౌంట్స్ విభాగంలో అద్దె బిల్లుల చెల్లింపుల్లో 10 శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు.
డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్ గతంలో రెండుసార్లు సస్పెండ్ అయ్యారని తెలిపారు. తన ప్రభావంతో 9 మంది అక్రమంగా పనిచేస్తున్నారని, తన భార్యకు 20 ఏళ్లుగా హైదరాబాద్ చుట్టుపక్కల స్కూళ్లలోనే పోస్టింగ్ ఇప్పిస్తున్నారని ఆరోపించారు. సెలవులు, పెన్షన్ ఫైళ్లను పెండింగ్‌లో పెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, కొందరు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ రాకుండానే చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులపై చర్యలు తీసుకోకపోతే సచివాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
