
హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు మేటి క్రికెటర్లను అందించిన హైదరాబాద్ ఆట గాడి తప్పింది. హెచ్‌సీఏలో అవినీతి, బంధుప్రీతి రాజ్యమేలుతోంది. అర్హులైన ఆటగాళ్లను కాదని, హెచ్‌సీఏ అధికారుల పిల్లలు, రాజకీయ నాయకుల బంధువుల కుమారులతో జట్లను నింపేస్తుండటంతో హైదరాబాద్ క్రికెట్ ఆగమవుతోంది. మూడు నెలల కిందటే ప్రెసిడెంట్‌గా ఎన్నికైన మహమ్మద్ అజరుద్దీన్ పాలనను గాలికి వదిలేయడంతో హైదరాబాద్ క్రికెట్ సంక్షోభంలో చిక్కుకుందనే విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నేతల సాయం ఆర్జించి ఎలక్షన్స్‌లో గెలిచిన అజరుద్దీన్ అండ్‌కో.. దానికి ప్రతిఫలంగా హైదరాబాద్ జట్లలో సదరు నేతల బంధువుల పిల్లలను ఎంపిక చేయడంతోనే అన్ని జట్ల ఆట తీసికట్టుగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బోణీ కొట్టని మూడు జట్లు…
ఇండియా డొమెస్టిక్ క్రికెట్‌లో కూచ్ బెహార్ (అండర్–19), కల్నల్ సీకే నాయుడు (అండర్–23), రంజీ ట్రోఫీలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ మూడు టోర్నీల్లో సత్తా చాటిన క్రికెటర్లు ఐపీఎల్‌తో పాటు టీమిండియా తలుపు తడుతుంటారు. కానీ, ఈ మూడింటిలో హైదరాబాద్ ఆట రోజు రోజుకు తీసికట్టుగా మారుతోంది. ఈ టోర్నీల్లో మన జట్లు ఇప్పటిదాకా బోణీనే కొట్టలేదు. రంజీ ట్రోఫీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన తన్మయ్ కెప్టెన్సీలోని హైదరాబాద్ పాయింట్ల ఖాతా తెరవలేదు. ఉప్పల్‌లో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో 8 వికెట్లతో చిత్తయిన మన జట్టు.. తర్వాత పంజాబ్ చేతిలో ఇన్నింగ్స్ తేడాతో మట్టికరించింది. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో ఓడి ప్రత్యర్థికి బోనస్ పాయింట్ ఇచ్చుకుంది. పంజాబ్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌లో 76 రన్స్‌కే ఆలౌటైన తన్మయ్‌సేన.. ఢిల్లీపై ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 69 పరుగులకు ఆలౌటై తలదించుకుంది. ఒకరిద్దరి వ్యక్తిగత పెర్ఫామెన్స్‌లు తప్పితే.. జట్టుగా హైదరాబాద్ దారుణంగా విఫలమైంది.
ఇక కూచ్ బెహార్ అండర్–19 టోర్నీలోనూ ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మన జట్టు విజయం సాధించలేకపోయింది. తొలి రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకున్న హైదరాబాద్.. మిగతా మూడింటిలో ఓడిపోయింది. 18 జట్లతో కూడిన ఎలైట్ ఎ,బి గ్రూప్‌లో ఆరు పాయింట్లతో 16వ స్థానంలో నిలిచి నాకౌట్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. అండర్–23 జట్టు పరిస్థితి మరీ దారుణం. రంజీ టీమ్ మాదిరిగా కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో ఓటముల హ్యాట్రిక్ కొట్టిన మికిల్ జైస్వాల్ కెప్టెన్సీలోని హైదరాబాద్.. కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌తో మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ తేడాతో చిత్తయింది. పంజాబ్‌తో జరిగిన లాస్ట్ మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో ఓడింది. గ్రూప్-–ఎలో సున్నా పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఈ మూడు టోర్నీల్లోనూ హైదరాబాద్ జట్లు నాకౌట్‌కు చేరుకోవడం కష్టమే. టోర్నీలు, జట్లు వేరైనా హైదరాబాద్ ఆట దిగజారడానికి కారణాలు మాత్రం సేమ్. టాలెంటెడ్ ప్లేయర్లను కాకుండా హెచ్‌సీఏ పాలకులు తమవాళ్లతో అన్ని జట్లను నింపేయడమే అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదేనా అజర్ తెచ్చిన మార్పు..!
హైదరాబాద్ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమంటూ ఎలక్షన్స్‌లో గెలిచిన అజర్ పాలనలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జట్టు బాగు కోసం రాష్ట్రం గర్వించదగ్గ ఆటగాడైన అంబటి రాయుడు గొంతెత్తితే వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సింది పోయి.. అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎదురుదాడికి దిగడంతోనే అజర్ ప్యానెల్ ఆలోచన విధానం ఏమిటో అభిమానులకు అర్థమైంది. ఇప్పుడు రాయుడు జట్టుకు దూరం కావడం, ప్రశ్నించే వారు లేకపోవడంతో హెచ్‌సీఏ పాలకులు ఆడిందే ఆటగా మారింది. సెలెక్షన్ కమిటీ భేటీల్లో తమ మాట చెల్లుబాటు కావడం లేదని, అజర్, సెక్రెటరీ విజయానంద్ జోక్యం ఎక్కువైందని, ఆటగాళ్లనే కాకుండా కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్‌ను చివరి నిమిషాల్లో మార్చేస్తున్నారని సెలెక్టర్ జైసింహా ఇప్పటికే బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్స్ సందర్భంగా చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా.. క్లబ్ సెక్రెటరీలు, రాజకీయ పలుకుబడి ఉన్న వారి పిల్లలు అన్ని జట్లకు ఎంపిక చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బహుశా.. ప్రెసిడెంట్‌గా అజర్ తెచ్చిన మార్పు ఇదేనేమో అని ఎద్దేవా చేస్తున్నారు. ‘హెచ్‌సీఏలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. సెలెక్షన్ ప్రకియ చాలా ఘోరంగా ఉంది. పనికి రాని వాళ్లను సెలెక్షన్ కమిటీల్లోకి తీసుకున్నారు. సెలెక్షన్ టైమ్‌లో వాళ్లు వాళ్లే కొట్లాడుకుంటున్నారు. ఇవన్నీ అజర్‌కు తెలిసే జరుగుతున్నాయి. ఆయన ఏం చేయలేడు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు నీకిది.. నాకది అని ముందుగానే ఒప్పందం చేసుకున్నారు’అని హెచ్‌సీఏ మాజీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. వెస్టిండీస్ లెజెండరీ బౌలర్ కర్ట్‌లీ ఆంబ్రోస్‌ను రంజీ టీమ్‌కు బౌలింగ్ కోచ్‌గా నియమిస్తామని అంటున్న అజర్.. ముందుగా అవినీతి అరికట్టాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా హెచ్‌సీఏ పెద్దలరాజకీయం క్రికెట్ ను దె బ్బతీయడమే కాకుండా దేశస్థాయిలో హైదరాబాద్ పరువుతీస్తోంది. బీసీసీఐ స్పందించి .. తగిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారేలా ఉంది.